Perni Nani | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ చేసిన మంచిని కూటమి ప్రభుత్వం చూడలేకపోతుందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ప్రజల బాగోగులు వదిలేసి జగన్‌పై అభాండాలు వేస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ పాలనపై కూటమి నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలపై తీవ్రంగా మండిపడ్డారు.
ఎగ్‌పఫ్‌ల కోసం రూ.3.63 కోట్లు ఖర్చు పెట్టారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్ని నాని మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వానికి చెందిన జీఏడీ ఇప్పుడు చంద్రబాబు చేతిలో ఉందని.. దాని సాయంతో తప్పుడు పోస్టులు పెట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఆ లెక్కలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వంలో అలాంటి తప్పులు ఎప్పుడు చేయలేదని స్పష్టం చేశారు. బొద్దింకలు, ఎలుకలు పట్టుకునేందుకు చంద్రబాబే కోట్లు చెల్లించారని ఎద్దేవా చేశారు. పరిపాలన చేతగాక జగన్‌పై పడి ఏడ్వడం మానుకోవాలని హితవు పలికారు. జీఏడీ శాఖ మంత్రిగా ఉన్న సీఎం చంద్రబాబు.. పఫ్‌ల ఖర్చు ఫైల్స్ బయటపెట్టగలరా అని ప్రశ్నించారు.
టమాటా రైతులను దత్తత తీసుకుంటానని ఏపీ మంత్రి నారా లోకేశ్ గతంలో హామీ ఇచ్చారని పేర్ని నాని గుర్తు చేశారు. ఇప్పుడు రైతులు బాధపడుతుంటే ఆయన ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అధికారంలో లేన్నప్పుడు ఒకలా.. అధికారంలోకి వచ్చాక మరోలా మాట్లాడటం ఎందుకని నిలదీశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు అయినా టమాటా రైతులను ఎందుకు దత్తత తీసుకోవడం లేదని నిలదీశారు.