AP News | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ సీనియర్ నాయకుడు, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం విరుచుకుపడ్డారు. చంద్రబాబును అబద్ధాల చక్రవర్తి అని విమర్శించారు. తమరి రాజకీయ జీవితంలో ఎప్పుడైనా నిజం మాట్లాడారా అని ప్రశ్నించారు. హామీలు అమలు చేయకుండా, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
అధికార దాహం తీర్చుకోవడం కోసం సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి, వాటిని అమలు చేయలేక చేతులు ఎత్తివేయడం మీలాంటి సీనియర్ రాజకీయ నాయకులకు తగునా అని ఆ లేఖలో చంద్రబాబును ముద్రగడ ప్రశ్నించారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ దొంగ సూపర్ సిక్స్ హామీల గురించి తలచుకుంటేనే భయమేస్తోందని సొల్లు కబుర్లు చెప్పడంలో మీకు మీరే సాటి అని విమర్శించారు. వీటిని అమలు చేయాలంటే కోట్లాది రూపాయల నిధులు కావాలన్న విషయం మీకు ముందు తెలియదా అని ప్రశ్నించారు. తెలిసి తెలిసి అబద్ధాలు చెప్పి ఎందుకు ఓట్లు వేయించుకున్నారని నిలదీశారు.
ప్రజలకు సూపర్ సిక్స్ హామీలు గుర్తుకు రాకుండా ఉండాలని తిరుపతి ప్రసాదం, రెడ్‌బుక్ రాజ్యాంగం, సోషల్‌మీడియా యాక్టివిస్టులను అరెస్టు చేయడం వంటి వివాదాలను తెరపైకి తీసుకొస్తున్నారని ముద్రగడ పద్మనాభం అన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. తమరి జీవితంలో ఒక్కసారైనా నిజం మాట్లాడారా అని ప్రశ్నించారు.