దేవుడిని కూడా టీడీపీ రాజకీయాల్లోకి లాగిందని మాజీ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. ఈ ప్రభుత్వంలో జరిగిన తప్పిదాన్ని గత ప్రభుత్వానికి అంటగడుతున్నారని మండిపడ్డారు. కాకినాడలో కురసాల మీడియాతో మాట్లాడుతూ.. లడ్డూ విషయంలో టీడీపీ దుష్ప్రచారం చేస్తూనే ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
భక్తుల మనోభావాలకు టీడీపీ భంగం కలిగించిందని కన్నబాబు అన్నారు. గత ప్రభుత్వంపై బురద జల్లి రాద్దాంతం చేశారని మండిపడ్డారు. సుప్రీంకోర్టు చివాట్లు పెట్టిన తర్వాత కూడా చంద్రబాబు అండ్ కో కట్టుకథలు ప్రచారం చేస్తూనే ఉన్నారని విమర్శించారు. జగన్ను తగ్గిస్తున్నామని అనుకుంటూ.. టీటీడీ విశిష్టతను దెబ్బతీస్తున్నారని ఆయన మండిపడ్డారు.
కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందని కన్నబాబు అన్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేసేందుకు టీడీపీ కుట్రలు చేస్తుందని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్లో నాలుగువేల ఉద్యోగులను తొలగిస్తున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం గాలికి వదిలేసి మంచి ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటుందని విమర్శించారు. నిత్యవసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలపై భారం పడుతుందని అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నిత్యవసర వస్తువుల ధరలు పెరిగితే.. మార్కెట్ స్థిరీకరణ నిధులతో తక్కువగా ప్రజలకు అందించామని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ధరలు ఎక్కడైనా తగ్గించారా అని ప్రశ్నించారు.