Devineni Avinash | తనపై వస్తున్న ఆరోపణలపై వైసీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాశ్ స్పందించారు. తాను విదేశాలకు వెళ్లాలని ప్రయత్నించానని వచ్చిన ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తెలిపారు. విజయవాడ నుంచి పారిపోవాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఒక వీడియోను విడుదల చేశారు.
తన నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు 24 గంటలూ అందుబాటులోనే ఉన్నానని దేవినేని అవినాశ్ ఆ వీడియోలో పేర్కొన్నారు. పనీపాట లేని కొన్ని మీడియా సంస్థలు, టీడీపీ సామాజిక మాధ్యమాల్లో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. నేను దేనికి పారిపోవాలి? ఎందుకు పారిపోవాలని ప్రశ్నించారు. తాను తప్పుచేశానని కోర్టు భావిస్తే కోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా ధైర్యంగా స్వీకరిస్తానని తెలిపారు.
తప్పుడు కేసులకు భయపడి పారిపోవాల్సిన అవసరం తనకు లేదని దేవినేని అవినాశ్ తెలిపారు. సమస్యలు వస్తే టీడీపీ నేతల్లా తాను పారిపోయేరకం కాదని పేర్కొన్నారు. తన తండ్రి తనకు జన్మనివ్వడంతో పాటు ధైర్యాన్ని కూడా ఇచ్చారని చెప్పారు. తమ నేత వైఎస్ జగన్, తమ పార్టీ వైసీపీ, కార్యకర్తలకు ఏ చిన్న సమస్య వచ్చినా అండగా ఉంటామని తెలిపారు. టీడీపీ, ఎల్లో మీడియా చేసే తప్పుడు ప్రచారాలను ఎవరూ నమ్మొద్దని కోరారు.
టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో దేవినేని అవినాశ్ నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి దుబాయి వెళ్లేందుకు అవినాశ్ ప్రయత్నించగా హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్ బలగాలు అడ్డుకున్నాయని వార్తలు వచ్చాయి.