Chevireddy Bhaskar Reddy | పోక్సో చట్టం కింద తనపై కేసు నమోదు చేయడంపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పందించారు. తనపై 11 సెక్షన్ల కింద తప్పుడు కేసులు పెట్టారని తెలిపారు. తన బిడ్డకు అన్యాయం జరిగిందని ఓ తండ్రి కోరితే వెళ్లానని చెప్పారు. సరైన వైద్యం అందించాలని తిరుపతి వైద్యులను కోరానని తెలిపారు. అంతేతప్ప ఈ ఘటనపై తాను ఎక్కడా మాట్లాడలేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ తనపై పోక్సో సహా 11 సెక్షన్ల కింద కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రకాశం జిల్లాలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని తెలిపారు. కేసులకు భయపడి పారిపోనని పేర్కొన్నారు. గతంలో ఇలాంటి కేసులు అనేకం ఎదుర్కొన్నానని తెలిపారు. 2014 నుంచి 2019 వరకు తనపై 88 కేసులు పెట్టి ఏం చేశారని అన్నారు. తన ఫోన్ స్విచ్ఛాఫ్ చేయనని.. ఎక్కడికీ పారినని తెలిపారు. ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయనని వెల్లడించారు. తనను జైలుకు పంపాలని అనుకుంటే సిద్ధంగా ఉన్నానని అన్నారు. జైల్లో ఉండే తన పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు.
బాధితురాలిని ఇబ్బంది పెట్టి రాద్దాంతం చేసిన పోలీసులపై పోక్సో కేసు పెట్టాలని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎవరో కళ్లలో ఆనందం చూడటం కోసం తప్పులు కేసులు పెడితే తర్వాత అధికారులకే ఇబ్బంది అని సూచించారు. తనను ఇబ్బంది పెట్టిన పోలీసులను కోర్టుకు లాగుతానని హెచ్చరించారు. పరువు నష్టం దావా వేస్తానని స్పస్టం చేశారు.
బిడ్డ ఆపదలో ఉందని ఓ తండ్రి ఫోన్ చేస్తే.. వెంటనే స్పందించి, బాధితురాలికి మెరుగైన వైద్యం అందించానని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. బాధిత బిడ్డ కుటుంబాన్ని కూటమి నేతలు పరామర్శించారా అని ప్రశ్నించారు. తనపై కేసులు పెడితే కార్యకర్తలు భయభ్రాంతులకు గురవుతారని అనుకుంటున్నారేమో.. అలాంటివి ఏమీ జరగవని స్పష్టం చేశారు.