Ambati Rambabu | దేశం మొత్తం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం నడుస్తుంటే.. ఏపీలో మాత్రం నారా లోకేశ్ తీసుకొచ్చిన రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఏపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వైసీపీ నాయకులపై అనేక దాడులు జరిగాయని తెలిపారు. ఇప్పటివరకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహాలపై, వైసీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాలపై టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారని పేర్కొన్నారు.
బీఆర్ అంబేడ్కర్ విగ్రహం మీద దాడి చేయడం అంటే భారత రాజ్యాంగం మీద దాడి చేయడమేనని అంబటి రాంబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో లా అండ్ అర్డర్ పనిచేయడం లేదని అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలోనే విజయవాడ అంబేడ్కర్ స్మృతివనంపై దాడి జరిగిందని తెలిపారు. అంబేడ్కర్ స్మృతివనంపై కుట్ర ప్రకారమే టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని విమర్శించారు. దాడిలో టీడీపీకి ప్రమేయం లేకపోతే వెంటనే అంబేడ్కర్ స్మృతివనంలో తొలగించిన శిలాఫలకాలను వైఎస్ జగన్ పేరుతో పునఃప్రతిష్టించాలని డిమాండ్ చేశారు.
యావత్తు దళిత జాతితో పాటు ప్రజాస్వామ్యవాదులంతా రాత్రి విజయవాడలో అంబేడ్కర్ స్మృతివనంపై జరిగిన దాడిని ఖండించాలని అంబటి రాంబాబు కోరారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ఏ ఒక్కరికీ భరోసా లేదని ఆందోళన వ్యక్తంచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాడుల పర్వం కొనసాగుతోందని విమర్శించారు. సీఎం చంద్రబాబు అభివృద్ధిలో పోటీపడాలి కానీ విధ్వంసాలతో పరిపాలన చేయడం మంచి విధానం కాదని మండిపడ్డారు.