Ambati Rambabu | తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ఒక మాజీ ముఖ్యమంత్రికి అనుమతి లేకపోవడం ఏంటని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. దైవ దర్శనానికి పోలీసుల నుంచి అనుమతి తీసుకోవడం ఏనాడైనా ఉందా అని నిలదీశారు. జగన్ తిరుమల పర్యటన రద్దయిన నేపథ్యంలో తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అంబటి రాంబాబు మాట్లాడారు.
వైఎస్ జగన్ తిరుపతి వెళ్తుంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు అంత ఆందోళన అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. జగన్ తిరుపతి ఎలా వస్తాడో చూస్తామని కొందరు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హైదరాబాద్కు చెందిన బీజేపీ నేతలు, తిరుపతి జనసేన నేతలు, టీడీపీ వారూ అందరూ ఇలాగే మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇంత విచిత్రమైన పరిస్థితిని తానెప్పుడూ చూడలేదని అన్నారు.
కేవలం ఆరుగురితో శ్రీవారి దర్శనానికి వెళ్లాలని వైఎస్ జగన్ వెళ్లాలని అనుకున్నారని అంబటి రాంబాబు తెలిపారు. కానీ ఆయన వెంట ఎవరూ వెళ్లకూడదంటూ వైసీపీ నాయకులకు పోలీసులు నోటీసులు ఇచ్చారని అన్నారు. అయినా జగన్ వెంట ఎవరూ వెళ్లొద్దంటూ పోలీసులు ఆంక్షలు పెట్టడమేంటని ప్రశ్నించారు. వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి మాజీ సీఎం అనుమతి లేకపోవడం ఏంటని అడిగారు. దేవుడి దర్శనానికి ఒకరి అనుమతి కావాలా? దైవ దర్శనానికి పోలీసుల నుంచి అనుమతి తీసుకోవడం ఏనాడైనా ఉందా? అని ప్రశ్నించారు.
డిక్లరేషన్ ఇవ్వాలని సీఎం చంద్రబాబు, బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతున్నారని అంబటి రాంబాబు తెలిపారు. వేంకటేశ్వర స్వామిని రాజకీయం కోసం వాడుకోవడం నీచాతినీచమని విమర్శించారు. వైఎస్ఆర్, వైఎస్ జగన్ అనేకసార్లు శ్రీవారిని దర్శించుకున్నారని.. పట్టువస్త్రాలు సమర్పించారని గుర్తుచేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ జగన్ తిరుమలకు వెళ్లారని తెలిపారు. అప్పుడు ఎప్పుడూ రాని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు వస్తుందని ప్రశ్నించారు.
శ్రీవారి లడ్డూ చుట్టూ రాజకీయం చేసి మీరు బాగుపడాలని ప్రయత్నం చేస్తే మీకే నష్టమని ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు హెచ్చరించారు. 0 వేల మందితో జగన్ దర్శనానికి వెళ్తున్నారని పోలీసులు నోటీసులు ఇవ్వడం బాధాకరమని అన్నారు. చంద్రబాబు అగ్లీ చేష్టలను ప్రజలు హర్షించరని విమర్శించారు.