Ambati Rambabu | తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంలో ఏపీ సీఎం చంద్రబాబు వైఖరిని సుప్రీంకోర్టు తప్పుబట్టిన నేపథ్యంలో మాజీ మంత్రి అంబటి సెటైర్లు వేశారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌పై వ్యంగ్యంగా స్పందించారు. కాదేదీ రాజకీయానికి అతీతమని ట్విట్టర్ వేదికగా విమర్శించారు. వరదలో పడవ, లడ్డూ ప్రసాదం, ముంబై నటి.. కాదేదీ చంద్రబాబు రాజకీయానికి అతీతమని సెటైర్ వేశారు. లడ్డూ ప్రసాదం విషయంలో రాజకీయ ఆరోపణలు చేసి లడ్డూలా దొరికిపోయాడని ఎద్దేవా చేశారు.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న వార్తలు ఇటీవల దుమారం రేపాయి. ఏకంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబే స్వయంగా కల్తీ జరిగిందని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు చంద్రబాబు వైఖరిని తీవ్రంగా తప్పుబట్టింది. కనీసం దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలని హితవు పలికింది. లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగించారనడానికి తగిన ఆధారాలు తమకైతే కనిపించడంలేదన్న అత్యున్నత ధర్మాసనం.. కల్తీ నెయ్యిని లడ్డూలో వాడారో లేదో పూర్తిగా తెలియకుండా ఎలా ప్రకటన చేస్తారని చంద్రబాబును నిలదీసింది.
సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
☞ స్వామి వారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యిని వినియోగించినట్లు ఎలా తెలిసింది? అయినా, కల్తీ నెయ్యిని వాడకుండా పక్కనబెట్టామని టీటీడీ ఈవో చెప్పారు కదా! అలాంటప్పుడు, లడ్డూ తయారీలో ఆ నెయ్యిని వాడినట్లు ఎలా చెప్తారు? దీన్నిబట్టి కల్తీ నెయ్యిని లడ్డూలో వాడినట్టు ఆధారాలు లేవని అర్థమవుతున్నది. అలాంటప్పుడు లడ్డూ కల్తీ జరిగిందని ఎలా చెప్తారు?
☞ లడ్డూ కల్తీ జరిగిందనుకొందాం. అయితే, ఆ శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించారా? పంపితే, వాటి రిపోర్టులేవి? టెస్టుల కోసం గుజరాత్‌లోని ఎన్డీడీబీ ల్యాబ్‌కే నెయ్యిని ఎందుకు పంపాల్సి వచ్చింది? మైసూరు, ఘజియాబాద్‌లో కూడా ల్యాబ్‌లు ఉన్నాయి కదా. సెకండ్ ఒపీనియన్ కోసం అక్కడికి శాంపిల్స్ ఎందుకు పంపలేదు. (సీఎం చంద్రబాబును ఉద్దేశిస్తూ..) నెయ్యి కల్తీ జరిగినట్టు జూలైలో నివేదిక వచ్చిందంటున్నారు. మరి ఆ విషయాన్ని సెప్టెంబర్‌లో తీరిగ్గా ఎందుకు చెప్పాల్సి వచ్చింది?
☞ నెయ్యి కల్తీ అయ్యిందా? లేదా? ఆ నెయ్యిని లడ్డూకి వాడారా? లేదా? అని తేల్చేందుకే సిట్ ఏర్పాటు చేశారు. ఒకవైపు సిట్‌ను ఏర్పాటు చేసిన మీరు (సీఎం).. లడ్డూ తయారీలో జంతువుల కొవ్వుతో చేసిన కల్తీ నెయ్యిని గత ప్రభుత్వ హయాంలో వాడారంటూ మీడియా ముఖంగా తేల్చిచెప్పడమేంటి? అలాంటప్పుడు సిట్ దర్యాప్తు ఎందుకు?
☞ కల్తీ నెయ్యిని లడ్డూలో వాడారో లేదో పూర్తిగా తెలియకుండా మీడియా ముందుకు మీరు (సీఎం) వెళ్లాల్సిన అవసరమేంటి? ఇక్కడ మరో విషయం. ఒకవైపు లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని సీఎం ప్రకటిస్తే, టీటీడీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈవో) మాత్రం కల్తీగా తేలిన నెయ్యిని అసలు లడ్డూ తయారీలో వాడలేదంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
☞ ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దు. కనీసం దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచండి. సీఎం తన వ్యాఖ్యలతో లక్షలాది మంది మనోభావాలను గాయపర్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం నియమించిన సిట్ సరిగ్గా విచారణ జరపగలదా? అనే అనుమానాలు మాకు కలుగుతున్నాయి. ఈ లడ్డూ వివాదంపై కేంద్రం ఏర్పాటు చేసే స్వతంత్ర కమిటీ విచారణ జరిపితే బావుంటుందేమో? అని మాకు అనిపిస్తున్నది.