Ambati Rambabu | జగన్ను ఆపడం చంద్రబాబు, చిట్టినాయుడు తరం కాదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. 164 సీట్లు తెచ్చుకుని మంచి పాలన చేయాల్సిన మీరు.. ఇంకా జగన్ నామ జపం చేస్తున్నారని విమర్శించారు. ఇచ్చిన హామీల సంగతి మరిచిపోయి జగన్ కట్టడి కోసం పనిచేస్తున్నారని అన్నారు. చిట్టినాయుడు దెబ్బకు చంద్రబాబు బుర్ర కూడా పోయిందని ఎద్దేవా చేశారు. జగన్ వస్తే విపరీతంగా జనం వస్తున్నారని మీరే ప్రచారం చేస్తున్నారు.. లా అండ్ ఆర్డర్ చూసుకోవాల్సిన హోంమంత్రి వంగలపూడి అనిత ఆ పని మాత్రం చేయడం లేదని అన్నారు. జగన్ విషయాలు మాట్లాడటం, ఆయన్ను తిట్టడం మాత్రమే చేస్తుందని మండిపడ్డారు.
వంగలపూడి అనిత జగన్ను తిట్టడమే పనిగా పెట్టుకుందని అంబటి రాంబాబు అన్నారు. జగన్ను తిడితేనే మంత్రి పదవి ఉంటుందని ఆమె భావిస్తున్నారని విమర్శించారు. తల్లి, చెల్లె వాటాల గురించి హోంమంత్రి చెబుతుందని.. మీ కుటుంబాల గురించి మాకు తెలియదా అని సంచలన వ్యాఖ్యలు చేశారు. చెక్స్ కేసులో మీరు కోర్టులకు వెళ్లలేదా అని నిలదీశారు.
వైసీపీ హయాంలో మంత్రివర్గంలో పనిచేసిన వారిని జైలుకు పంపుతున్నారని అంబటి రాంబాబు అన్నారు. అయితే ఏమవుతుంది.. రేపు మేం అధికారంలోకి వచ్చాక మావాళ్లు కూడా ఇదే చేయమంటారు కదా అని వ్యాఖ్యానించారు. తప్పుడు కేసులు పెడుతూ చంద్రబాబు మోచేతి నీళ్లు తాగే కొందరు ఐపీఎస్ అధికారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. మీరేమీ అతీతులు కాదని.. రాజకీయంగా మమ్మల్ని అణగదొక్కాలని చూస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. నిబంధనల ప్రకారం పనిచేయాలని సూచించారు.
నారా లోకేశ్ ఇప్పుడు హైక్యాష్గా మారిపోయారని అంబటి రాంబాబు విమర్శించారు. అధికారం మూణ్నాళ్ల ముచ్చట అని గుర్తుంచుకోవాలని సూచించారు. ప్రసన్న కుమార్ రెడ్డి ఒక మహిళను ఇష్టానుసారంగా మాట్లాడారని కేసులుపెట్టారు కదా.. మళ్లీ ఆయనపై ఎందుకు దాడి చేస్తున్నారని ప్రశ్నించారు. మా నాయకుడిని మేం పరామర్శిస్తే తప్పేంటని నిలదీశారు. వాళ్లు నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులే తప్ప నేరస్తులు కాదని స్పష్టం చేశారు. ఆ లెక్కకు వస్తే చంద్రబాబు కూడా జైళ్లో ఉన్నారు.. చిట్టినాయుడు పిట్ట కథలు గతంలో పర్యటనల సందర్భంగా చాలానే విన్నామని ఎద్దేవా చేశారు.
జగన్ పర్యటనల సమయంలో జనం వచ్చిన విజువల్స్ చూపించాల్సిన అవసరం లేదని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. విజువల్స్ మార్ఫింగ్ చేయాల్సిన దుస్థితి తమకు పట్టలేదని అన్నారు. జనం రాకపోతే అసలు లాఠీచార్జ్ ఎందుకు చేశారో హోం మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వాళ్లు ఎంత కట్టడి చేస్తే అంత జనం వస్తున్నారని తెలిపారు. చంద్రబాబు మా తోకలు కట్ చేయడం కాదు.. మా తోకలు జనం కట్ చేశారు.. మీ తోకలు కట్ చేయకుండా చూసుకోండి అని సెటైర్లు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా జగన్ మీద ఎన్ని మాటలు చెప్పినా జనాలు నమ్మరని స్పష్టం చేశారు.