Ambati Rambabu | వైసీపీ ప్రభుత్వం అసమర్థతతో పోలవరం ప్రాజెక్టును నాశనం చేసిందని ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు అనేక అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అవగాహనరాహిత్యం వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైందని అన్నారు.
అసలు పోలవరం ప్రాజెక్టును ప్రారంభించింది.. కట్టాలనుకున్నది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని అంబటి రాంబాబు తెలిపారు. కానీ పోలవరాన్ని తానే కడుతున్నట్లుగా చంద్రబాబు కథలు చెబుతున్నారని విమర్శించారు. కేంద్రం కట్టాల్సిన ఈ ప్రాజెక్టును.. బతిమిలాడి మేమే కడతామని చెప్పి తెచ్చుకున్నారని తెలిపారు. ఇది చంద్రబాబు చేసిన చారిత్రాత్మక తప్పిదమని అన్నారు.
పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని అంబటి రాంబాబు అన్నారు. స్పిల్వే గేట్లు కూడా అమర్చామని అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. ఈ అబద్ధాలు వింటే ప్రజలు నవ్విపోతారని వ్యాఖ్యానించారు. స్పిల్ వే పూర్తి చేసింది వైసీపీ అని.. స్పిల్ వే గేట్లు పెట్టింది వైసీపీ అని స్పష్టం చేశారు. ఒక రేకు తీసుకొచ్చి అక్కడ పెడితే స్పిల్ వే గేట్లు అమర్చినట్లు కాదని ఎద్దేవా చేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంతర్జాతీయ సైంటిస్టుల బృందం వచ్చి పోలవరం ప్రాజెక్టును పరిశీలించిందని అంబటి రాంబాబు తెలిపారు. 2014-19 మధ్యలో పోలవరం కట్టడంలో తప్పులు జరిగాయని, అంతర్జాతీయ నిపుణుల కమిటీ తేల్చిందని చెప్పారు. అసలు కాపర్ డ్యామ్ కట్టకుండా, డయాఫ్రమ్ వాల్ కట్టడం చారిత్రాత్మక తప్పిదమని ఆయన అన్నారు. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి అదే కారణమని వివరించారు. మీరు చేసిన తప్పిదం వల్లే మళ్లీ 900 కోట్లతో డయాఫ్రమ్ వాల్ నిర్మించాల్సి వస్తుందని అన్నారు. దీనికి చంద్రబాబే బాధ్యుడు అని స్పష్టం చేశారు. దాన్ని కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ, చంద్రబాబు అవగాహన రాహిత్యం వల్లే పోలవరం ప్రాజెక్టు దెబ్బతిన్నదని స్పష్టం చేశారు. నదివిన డైవర్ట్ చేయకుండా ఏ దేశంలోనైనా ప్రాజెక్టులు కడతారా అని ప్రశ్నించారు. వేరే దేశాల్లో అయితే ఈ తప్పులకు ఉరిశిక్షలు వేస్తారని హెచ్చరించారు.