Tirumala | తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి వాడే నెయ్యిలో కల్తీ జరిగిందని టీడీపీ చేస్తున్న ఆరోపణలపై వైసీపీ ధీటుగా స్పందించింది. చంద్రబాబు రాజకీయ పునాదులు అబద్ధాలు, డైవర్షన్ పాలిటిక్స్ అని విమర్శించింది. లడ్డూ వ్యవహారంలో కూడా చంద్రబాబు పద్ధతి ఇదే అని మండిపడింది.
భోలే బాబా డెయిరీ నుంచి వైష్ణవి డెయిరీ కిలో నెయ్యిని రూ.355 కొని.. ఏఆర్ డెయిరీకి రూ.318.57కి ఇచ్చిందని, అదే నెయ్యిని ఏఆర్ డెయిరీ కిలోకు రూ.319.80 చొప్పున టీటీడీకి సరఫరా చేసిందని తాజాగా టీడీపీ తెలిపింది. దీన్ని బట్టి కల్తీ నెయ్యి విషయంలో జగన్ రెడ్డి ఏ రేంజ్లో కథ నడిపించి ఉంటాడో అర్థమవుతుందని పేర్కొంది. టీడీపీ చేస్తున్న ఈ ప్రచారంపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము అడిగే ప్రశ్నలకు అయినా.. కనీసం సుప్రీం కోర్టు అబ్జర్వేషన్లకు అయినా సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది.
ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి
1. లడ్డూల్లో కల్తీ నెయ్యి కలిస్తే.. ఆధారాలెక్కడ?
2. కల్తీ జరిగిందని అనుకున్నప్పుడు లడ్డూలపై ఎందుకు పరీక్షలు చేయించలేదు?
3. కల్తీ నెయ్యిపై టీటీడీ ఈవో ఒక మాట, సీఎం ఒక మాట ఎందుకు చెప్పారు? ఆరోపణలున్న నెయ్యిని తిప్పిపంపామని ఈవో, లేదు వాడారని సీఎం.. పరస్పర విరుద్ధ ప్రకటనలు ఎందుకు చేశారు?
4. ఎలాంటి ఆధారం లేకుండా భక్తుల మనోభావాలను చంద్రబాబు ఎందుకు దెబ్బతీశారు?
5. జులై 23న రిపోర్టు వస్తే సెప్టెంబరు 18వరకూ 54 రోజులపాటు ఎందుకు దీని గురించి పట్టించుకోలేదు.
6. అసలు నెయ్యి సరఫరా జరిగింది ఎప్పుడు? చంద్రబాబు పరిపాలనలో కాదా?
7. శాంపిళ్లు తీసిన జులై 6, జులై 12 తేదీల్లో నడుస్తున్నది చంద్రబాబు ప్రభుత్వమే కదా? టీటీడీలో ఉన్నది చంద్రబాబు వేసిన ఈవోనే కదా?