YS Jagan | ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలిలో నడిరోడ్డుపై ముగ్గురు యువకులను పోలీసులు చితకబాదిన ఘటనపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు. గంజాయి మత్తులో దాడికి ప్రయత్నించారని వారిపై తప్పుడు కేసులు పెట్టి నడిరోడ్డుపై చితకబాదడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులు ఎవరి మీద అయినా ఉండొచ్చని.. ఆ వ్యవహరాన్ని కోర్టులు చూసుకుంటాయని తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబుపై 24 కేసులు ఉన్నాయని.. అలా అని నడిరోడ్డు మీదకు తీసుకొచ్చి తన్నడం ధర్మమేనా? పోలీసులే చట్టాన్ని ఉల్లంఘిస్తారా? ఇలా చేసే నైతికత పోలీసులకు ఉందా అని ప్రశ్నించారు. పరువు ప్రతిష్టలను తీకే హక్కు పోలీసులకు ఉందా అని నిలదీశారు. నడిరోడ్డుపై కొట్టే హక్కు పోలీసులకు ఎవరిచ్చారని అడిగారు.
తెనాలిలో నడిరోడ్డుపై పోలీసుల చేతిలో హింసకు గురైన యువకుల కుటుంబాలను జగన్ పరామర్శించారు. వారి కుటుంబాలను ఓదార్చారు. వైసీపీ తరఫున వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రెడ్‌బుక్ రాజ్యాంగంతో రాష్ట్రం అప్పుల పాలైందని మండిపడ్డారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ దిగజారిపోయిందని విమర్శించారు. పోలీసుల వికృత రూపానికి తెనాలి ఘటనే సాక్ష్యమని అన్నారు.
చంద్రబాబు నాయుడు మీద కూడా పాత కేసులు ఉన్నాయి, అతన్ని కూడా రోడ్డుపై కూర్చోబెట్టి కొడతారా – వైఎస్ జగన్ https://t.co/2EEbFNnwQO pic.twitter.com/FYDKOVVRFA
— Telugu Scribe (@TeluguScribe) June 3, 2025
తెనాలి పోలీసుల చేతిలో ముగ్గురు యువకులు దెబ్బలు తిన్నారని.. వారిలో రాకేశ్ హైదరాబాద్‌లో జొమాటో డెలివరీబాయ్‌గా పనిచేస్తున్నాడని జగన్ అన్నారు. ఆ యువకుడు తెనాలిలోనే ఉండటం లేదని.. పాత కేసులో వాయిదా కోసం తెనాలికి వచ్చాడని చెప్పారు. రాకేశ్‌ను చూడటానికి మంగళగిరి నుంచి అతని స్నేహితులు వచ్చారని తెలిపారు. వీరిలో జాన్ విక్టర్ జూనియర్ అడ్వకేట్ అని.. అతనికి బార్ కౌన్సిల్లో సభ్యత్వం కూడా ఉందని తెలిపారు. ఐతా నగర్లో సివిల్ డ్రెస్‌లో ఉన్న ఓ కానిస్టేబుల్ ఎవరితోనో గొడవ పడుతుంటే సదరు యువకులు అడ్డుకున్నారని చెప్పారు. కేవలం కానిస్టేబుల్‌ను ప్రశ్నించడమే వీరు చేసిన తప్పా అని నిలదీశారు.
దళిత యువకులను చితకబాదిన పోలీసులు
గుంటూరు జిల్లాలోని తెనాలి పట్టణంలో ఐతానగర్ కు చెందిన యువకులు గంజాయి మత్తులో కానిస్టేబుల్ పై దాడి చేశారని నడి రోడ్డుపై కూర్చోబెట్టి లాఠీలతో కాళ్ళపైన విచక్షణారహితంగా కొట్టిన పోలీసులు
అయితే కానిస్టేబుల్ చిరంజీవి తమను లంచం అడిగాడని, అందుకు తాము… pic.twitter.com/gI6VSswvi1
— Telugu Scribe (@TeluguScribe) May 26, 2025
ఏప్రిల్ 24వ తేదీని కానిస్టేబుల్‌ను ముగ్గురు యువకులు ప్రశ్నించారని.. 25వ తేదీన పోలీసులు మంగళగిరి వెళ్లి జాన్ విక్టర్, కరీముల్లాను కొట్టుకుంటే తీసుకొచ్చారని, తెనాలి పోలీస్ స్టేషన్లో కూడా పడేసి కొట్టారని అన్నారు. ఏప్రిల్ 26వ తేదీన ఐతా నగర్లో నడిరోడ్డుపై పడేసి ముగ్గురిని చితకబాదారని తెలిపారు. కొట్టవద్దని వేడుకున్నా కానీ పోలీసులు వదల్లేదని పేర్కొన్నారు. విక్టర్ జేబులో పోలీసులే కత్తి పెట్టారని.. ఈ వ్యవహారంలో తెనాలి టూటౌన్ సీఐ, మరో సీఐ కూడా ఉన్నారని ఆరోపించారు. నిజంగా వాళ్లు తప్పు చేసి ఉంటే.. అరెస్టు చేసిన వారిని సకాలంలో కోర్టు ముందు ఎందుకు ప్రవేశపెట్టలేదని జగన్ ప్రశ్నించారు. ఇది చట్టాన్ని ఉల్లంఘించడం కాదా అని నిలదీశారు. ఈ ఘటన జరిగిన తర్వాతే ముగ్గురి మీద రౌడీషీట్ తెరిచారని.. దీన్ని బట్టే పోలీసులు ఎంత దుర్మార్గంగా వ్యహరించారనేది అర్థమవుతుందని అన్నారు.