Nandyal | నంద్యాల జిల్లాలో వైసీపీ నాయకుడు సుబ్బరాయుడి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల వైఫల్యం కారణంగానే దారుణం జరిగిపోయిందని తెలుస్తోంది. సుబ్బరాయుడిపై దాడి జరుగుతున్న సమయంలోనే పోలీసులకు కాల్ చేసినప్పటికీ స్పందించలేదని.. దీనివల్ల వైసీపీ నాయకుడు ప్రాణాలు పోయాయని వైసీపీ ఆరోపించింది. ఈ మేరకు సాక్ష్యాధారాలను బయటపెడుతూ.. ఘటన జరిగిన పరిస్థితిని ట్విట్టర్ (ఎక్స్) వేదికగా వివరిస్తూ సుదీర్ఘ పోస్టు పెట్టింది.
గ్రామంలో తనను హత్య చేసేందుకు టీడీపీ గూండాలు వస్తున్నారని వైసీపీ నేత నారపురెడ్డి శనివారం రాత్రి 12.59 గంటలకు జిల్లా ఎస్పీకి ఫోన్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉందని.. వెంటనే పోలీసులను పంపించాలని వేడుకున్నాడు. అయినప్పటికీ ఒక ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లను మాత్రమే సీతారామపురం గ్రామానికి ఎస్పీ పంపించారు. పోలీసులు వచ్చిన తర్వాతనే టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి, ఆయన అనుచరులు గ్రామంలోకి చొరబడ్డారు. పోలీసులు ఉండగానే సుబ్బరాయుడి ఇంటిపై వాళ్లు మారుణాయుధాలతో దాడి చేశారు. అడ్డొచ్చిన గ్రామస్తులను టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి కత్తితో బెదిరించాడు.
పెద్ద సుబ్బరాయుడిని కిరాతకంగా టీడీపీ నేతలు హత్య చేస్తున్నప్పటికీ పోలీసులు అడ్డుకోలేదని గ్రామస్తులు ఆరోపించారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అర్ధరాత్రి 1.30 గంట నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు గ్రామంలో టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి విధ్వంసం సృష్టించారు. ఆ సమయంలో ఎస్పీకి నారపరెడ్డి ఐదు సార్లు ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. అయినప్పటికీ పట్టించుకోని ఎస్పీ.. దాదాపు రెండున్నర గంటల తర్వాత అదనపు బలగాలను గ్రామానికి పంపించారు. పోలీసుల సమక్షంలోనే పెద్ద సుబ్బరాయుడిని హత్య చేసి పలువురిని గాయపరిచి శ్రీనివాసరెడ్డి తాపీగా అక్కడి నుంచి వెళ్లిపోయారని వైసీపీ ఆరోపించింది.
నంద్యాల జిల్లాలో శనివారం రాత్రి వైసీపీ నాయకుడిని దారుణంగా హత్య చేశారు. మహానంది మండల పరిధిలోని సీతారామపురంలో వైసీపీ నేత సుబ్బరాయుడిని కొంతమంది దుండగులు రాళ్లతో అత్యంత కిరాతకంగా కొట్టి చంపేశారు. దాదాపు 40 మంది దుండగులు దాడి చేసి హతమార్చినట్లుగా తెలుస్తోంది. గ్రామానికి చెందిన టీడీపీ నాయకులే తన భర్తను చంపేశారని సుబ్బరాయుడు భార్య ఆరోపిస్తుంది. ఈ క్రమంలోనే ఈ ఘటనపై వైఎస్ జగన్ సీరియస్గా స్పందించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్య ప్రభుత్వ స్థానంలో ముఠాల పాలన కనిపిస్తోందని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. ఈ రెండు నెలల కాలంలోనే ఏపీ అంటేనే రాజకీయ హింసకు మారుపేరుగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితిలో ఏ మాత్రం మార్పు రావడం లేదని అన్నారు.