అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ) కాకినాడ జిల్లా పిఠాపురం ( Pithapuram ) నియోజకవర్గంలో శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా సుమారు రూ.3 వందల కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా పీఠికాపుర సంక్రాంతి మహోత్సవంలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు.
పిఠాపురం నియోజకవర్గలో కొందరు గొడవలు సృష్టించేందుకు వస్తే ఇక్కడే తాను తిష్టవేసి ఏరి పారేస్తానని హెచ్చరించారు. నియోజకవర్గంలో కాకి ఈక పడ్డ ఏదో జరిగిందని వైరల్ చేస్తూ అవాస్తవాలను ప్రసారం చేస్తున్నారని మండిపడ్డారు. పులివెందులలో సొంత బాబాయ్ వైఎస్ వివేకను ని చంపినా అది వార్తకాదని, పిఠాపురంలో స్కూల్ పిల్లలు కొట్టుకోవడం సహజమని, దానిని కూడా పెద్ద వార్త చేస్తున్నారని అన్నారు.
సంక్రాంతి పండుగ అంటే కేవలం కోళ్ల పందెలు, జూదాలకు మాత్రమే కాకుండా ప్రేమను పంచాలని సూచించారు. తెలంగాణలో ఉన్న సోదరీమణులను సంక్రాంతికి ఆహ్వానించి ఆంధ్రా ప్రాంతా ప్రజల ప్రేమను పంచాలని అన్నారు. ఐక్యమత్యంగా ఉంటే అభివృద్ధి సాధించవచ్చన్న ఉద్దేశంతో టీడీపీతో కూటమిగా ఏర్పడడం వల్ల రాష్ట్రానికి ఎంతగానో మేలు జరుగుతుందని అన్నారు. అందరిని కలపడం కష్టమని అటువంటిది తాను గల్లి నుంచి ఢిల్లీ వరకు అందరినీ ఏకం చేసి విజయం సాధించానని అన్నారు.
అభివృద్ధి లక్ష్యం నెరవేరే వరకు కూటమితో కలిసి ఉంటామని, అందులో సందేహం అవసరం లేదని వెల్లడించారు. వైసీపీ నాయకులు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినట్లయితే తాను ఎందుకు రాజకీయాల్లోకి వస్తానని పేర్కొన్నారు.