AP News | నంద్యాల జిల్లాలో దారుణం జరిగింది. గొడవ పడి పుట్టింటికి వెళ్లిన భార్యకు నచ్చజెప్పేందుకు వెళ్లిన భర్తను అత్తింటివారు కొట్టి చంపేశారు. భార్య, ఆమె తమ్ముడు కంటిలో కారం జల్లి దాడి ఈ దారుణానికి ఒడిగట్టారు. చనిపోయిన తర్వాత భర్త డెడ్ బాడీని ఇంటికి డోర్ డెలివరీ చేయడం ఇప్పుడు స్థానికంగా కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే.. పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన రమణమ్మకు నంద్యాల జిల్లా నూనెపల్లికి చెందిన పెయింటర్ శేషాచలం (48)కి వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అయితే కొంతకాలంగా భార్యాభర్తలకు తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రెండు నెలల క్రితం రమణమ్మ పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు వెళ్లింది. ఇదిలా ఉండగా తన తల్లికి ఆరోగ్యం బాగోలేదని ఇంటికి రావాలని భర్తకు ఫోన్ చేసి రమ్మని రమణమ్మ చెప్పింది.
ఎలాగైనా భార్యకు నచ్చజెప్పి ఇంటికి తీసుకురావాలని శేషాచలం కూడా వెంటనే పిడుగురాళ్లకు బయల్దేరాడు. కానీ ఆ తర్వాత రోజే నంద్యాలలోని అతని ఇంట్లో మృతదేహం ఉండటం కలకలం రేపింది. అయితే తమ తల్లి, మామ కలిసి తమ తండ్రి కళ్లలో కారం కొట్టి దాడి చేశారని శేషాచలం కూతుళ్లు ఆరోపిస్తున్నారు. దీంతో భార్యనే భర్తను చంపేసి డోర్ డెలివరీ చేసిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమెదు చేసకుని దర్యాప్తు చేస్తున్నారు.