అమరావతి : వైసీపీ పాలనలో అధికారుల అస్తవ్యస్త పనితీరును చంద్రబాబు గాడిలో పెట్టడానికి చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra ) వెల్లడించారు. ఏకాదశి సందర్భంగా బుధవారం ఆయన తిరుమల (Tirumala) లో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
గత పాలకుల నిర్లక్ష్యం వల్ల జరిగిన నష్టాన్ని ప్రజలకు వివరించి, పారదర్శక పాలన అందించేందుకు 7 శ్వేత పత్రాలను(White Papers) విడుదల చేస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే నాలుగు పత్రాలను విడుదల చేశారని వివరించారు. త్వరలో మద్యం, ఆర్థికశాఖపై పత్రాలను విడుదల చేయనున్నారని తెలిపారు. వైఎస్. జగన్ (YS Jagan) ఐదేండ్ల ఆరాచక పాలన, అన్యాయాలను , దోపిడిని ప్రజలకు వివరించనున్నామని పేర్కొన్నారు.
వైసీపీ నాయకులు తమ స్వార్థం కోసం అన్ని శాఖలను ఉపయోగించుకుని భ్రష్టు పట్టించారని ఆరోపించారు. ల్యాండ్ అండ్ టైటిలింగ్ చట్టంతో దుర్మార్గాలు చేయాలని చూశారని విమర్శించారు. లోపాలను సరిదిద్దుకుని రాబోయే కాలంలో స్వచ్ఛమైన పాలనను చంద్రబాబు నాయకత్వంలో చూడబోతున్నామని వివరించారు. ఇప్పటికే ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని,ఇంటింటికే వెళ్లి పెంచిన పెన్షన్లు అందజేశామని తెలిపారు. త్వరలో అసెంబ్లీ సమావేశాలు జరుగున్నాయని వెల్లడించారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని , ఏపీ సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని కోరుకున్నానని తెలిపారు.