Buddha Venkanna | పేర్ని నానికి శ్వేతపత్రం అంటే ఏంటో తెలుసా అని టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఎద్దేవా చేశారు. వైసీపీ వాళ్లు ఎప్పుడైనా శ్వేతపత్రాలు విడుదల చేశారా అని ప్రశ్నించారు. గత ఐదేళ్లలో వైసీపీ పరిపాలన ఎలా చేశారో చెప్పాల్సిన బాధ్యత తమపై ఉంది కాబట్టే చంద్రబాబు శ్వేతపత్రాలను విడుదల చేస్తున్నారని బుద్ధా వెంకన్న తెలిపారు. శ్వేతపత్రాల విడుదలతో వైసీపీ వాళ్ల దొంగతనాలు ఎక్కడ బయటపడతాయో అని భయపడుతున్నారని విమర్శించారు. అందుకే ప్రెస్మీట్లు పెట్టి విమర్శిస్తున్నారని ఆరోపించారు.
పోలవరం పూర్తి చేయాలనే లక్ష్యంతో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటనలు చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకే ఢిల్లీ టూర్లకు వెళ్తున్నారని వివరించారు. ఎప్పుడైనా జగన్ ఢిల్లీకి వెళ్లినప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేశారా అని ప్రశ్నించారు. అందుకే వైసీపీకి ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని అన్నారు. వైసీపీని ఇప్పటికే ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలిపారు. ఆ 11 సీట్లు కూడా ఎందుకు ఇచ్చామని ఆలోచనలో పడ్డారని అన్నారు. పార్టీని పూర్తిగా భూస్థాపితం చేస్తే బాగుండు అని అనుకుంటున్నారని చెప్పారు.