AP News | నా మతం మానవత్వం.. డిక్లరేషన్‌లో రాసుకుంటారేమో రాసుకోండి అని మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు ఘాటుగా స్పందించారు. తనను చిత్రహింసలకు గురిచేసినప్పుడు ఆయన మతం, మానవత్వం ఎక్కడ పోయిందని ప్రశ్నిస్తారు. శ్రీవారిపై నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇచ్చి పూజిస్తే.. క్రైస్తవుల ఓట్లు తనకు దూరమవుతాయని జగన్ ఆందోళన చెందుతున్నారేమో అని ఎద్దేవా చేశారు.
కంచె చేను మేసిందన్న చందంగా టీటీడీ చైర్మన్ హోదాలో హిందూ ధర్మాన్ని పరిరక్షించాల్సిన వ్యక్తులే ఆచార సంప్రదాయాలను మంటగలిపారని రఘురామకృష్ణ రాజు ఆరోపించారు. గతంలో అబ్దుల్ కలాం, సోనియాగాంధీ వంటి వారు స్వామి వారిని దర్శించుకునే ముందు డిక్లరేషన్ ఇచ్చారని గుర్తుచేశారు. గతంలో జగన్ తిరుమలకు వచ్చినప్పుడు డిక్లరేషన్ ఇవ్వాలని అడిగితే అధికారులను చీదరించుకొని, చెప్పులు వేసుకునే మాడవీధుల్లో తిరిగారని మండిపడ్డారు. జగన్‌తో పాటు తిరుమలకు అల్లరి మూకలు చేరి చిల్లరగా వ్యవహరిస్తే బాధ్యత ఎవరిది అని రఘురామకృష్ణ రాజు ప్రశ్నించారు. ఆ భయంతోనే పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారని వివరించారు.
తనను చిత్రహింసలకు గురిచేసిన సీఐడీ మాజీ చీఫ్ సునీల్‌కుమార్‌ను తక్షణమే అరెస్టు చేయాలని రఘురామకృష్ణరాజు డిమాండ్‌చేశారు. తనను భయపెట్టాలని చూడవద్దని అన్నారు. తనకు లేనిదే భయమని స్పష్టం చేశారు.