అమరావతి : దేశంలో జమిలి ఎన్నికలపై (Jamili election) ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) స్పందించారు. జమిలి అమల్లోకి వచ్చినా, ఎన్నికలు జరిగేది 2029లోనేనని స్పష్టం చేశారు. విజయవాడలో శనివారం చంద్రబాబు మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఒక దేశం, ఒకే ఎన్నిక విధానానికి ఇప్పటికే మా మద్దతు ప్రకటించామని వెల్లడించారు.
వైసీపీ(YCP) పబ్బం గడుపుకోవడానికి ఏదిపడితే అది మాట్లాడుతుందని ఆరోపించారు. వైసీపీ నేతలు ప్రజల్లో ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయారని విమర్శించారు. వైసీపీ చేసే నాటకాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు.రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతుందని పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ను (Vision Documents) మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, వర్సిటీలు, కళాశాలలు, పాఠశాలలో పాటు ప్రతిచోటా చర్చ జరగాలని కోరారు.
విజన్ 2020 సాకారమైన తీరును నేటితరం తెలుసుకోవాలన్నారు. స్వర్ణాంధ్ర 2047 ఒకరోజు కోసం పెట్టి వదిలేసేది కాదని అన్నారు. భవిష్యత్ తరాల బాగుకోసం చేసే ప్రయత్నంలో అందరి భాగస్వామ్యం కావాలని, రేపటి తరం భవిష్యత్తు కోసమే విజన్ 2047అని తెలిపారు. సాగునీటి సంఘాలు, సహకార, ఇతరాత్ర ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని వెల్లడించారు.