అమరావతి: నవ వధువును అత్తవారింటికి పంపిన కొద్ది సేపట్లోనే తండ్రి రోడ్డుప్రమాదంలో మరణించిన విషాద ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో చోటు చేసుకుంది. జిల్లాలోని పెద్దమండ్యం మండలం వెలిగల్లు గ్రామానికి చెందిన చలపతి, మల్లమ్మ దంపతుల కూతురు అరుణకు శుక్రవారం మదనపల్లెకు చెందిన యువకుడితో వివాహం జరిపించారు. వివాహతంతు పూర్తయిన తరువాత సాయంత్రం కూతురిని కారులో అత్తగారింటికి పంపించారు.
వధువు తల్లీదండ్రులు ద్విచక్రవాహనంపై ఇంటికి బయలుదేరగా మార్గమధ్యలో కురబటకోట మండలం అంగళ్లు సమీపంలోని రామక్క చెరువు కట్ట వద్ద ఎదురుగా వచ్చిన ఆటో వీరిని ఢీకొట్టింది. దీంతో కిందపడ్డ దంపతులతో పాటు ఆటోలో ఉన్న మరో వ్యక్తికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడ్డ ముగ్గురిని మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో చలపతి పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు.
కూతురిని సాగనంపిన కొద్దిసేపటికే తండ్రి మరణించడంతో గ్రామంలో విషాదచాయలు నెలకొన్నాయి. ముఖ్యంగా తండ్రి మరణ వార్త తెలుసుకుని పరుగున వచ్చిన కూతురు రోదనలతో ఆ పరిసర ప్రాంతమంతా మిన్నంటాయి.