అమరావతి : ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఒకమాట, అధికారంలోకి వచ్చిన తరువాత మరో మాట్లాడటం టీడీపీకి అలవాటేనని వైసీపీ నాయకుడు, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) ఆరోపించారు. అనకాపల్లి జిల్లాలో బల్క్‌డ్రగ్ పార్కుకు ( Bulk drug park ) వ్యతిరేకంగా నిర్వహిస్తున్న దీక్షలను బుధవారం వైసీపీ నాయకులు సందర్శించి మత్స్యకారులకు సంఘీభావం ప్రకటించారు.
అనంతరం బొత్స మీడియాతో మాట్లాడారు. బల్క్‌డ్రగ్ పార్క్ ఏర్పాటును వైసీపీ అడ్డుకుంటుందని తెలిపారు. తాము పరిశ్రమల ఏర్పాటుకు వ్యతిరేకం కాదన్నారు. అయితే ప్రజల ప్రాణాలను హరించే పరిశ్రమలను వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. గతంలో మంత్రి అనిత ఎన్నికలకు ముందు బల్క్‌డ్రగ్ పార్క్‌తో క్యాన్సర్, పిల్లలకు వైకల్యం వస్తుందని చెప్పి, ఇప్పుడు దాని ఏర్పాటు ముందుండి నడిపిస్తున్నారని పేర్కొన్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు మత్స్యకారుల దీక్షా శిబిరాన్ని సందర్శించామని, త్వరలోనే దీక్ష శిబిరాన్ని జగన్ సందర్శిస్తారని వెల్లడించారు. సమస్యపై నిలదీస్తున్న ప్రజలపై ప్రభుత్వం పెడుతున్న కేసులను వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎత్తివేస్తామని అన్నారు. ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేస్తామని తెలిపారు.