YS Jagan | ఎన్నికల ఫలితాలు చాలా ఆశ్యర్యానికి గురిచేశాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. ఇలాంటి ఫలితాలు చూసిన తర్వాత బాధ కలిగిందని తెలిపారు. తాడేపల్లిలోని వైసీపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో వైసీపీ శ్రేణులకు జగన్ దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ఫలితాలను చూసిన తర్వాత శకుని పాచికల కథ గుర్తుకొచ్చిందని తెలిపారు. శకుని పాచికల మాదిరిగా ఎన్నికల ఫలితాలు వచ్చాయని.. కానీ ఆధారాలు లేకుండా మాట్లాడలేం అని అన్నారు.
ఈ ఎన్నికల్లో 40 శాతం ఓట్లు మనకు వచ్చాయన్న విషయం మరిచిపోవద్దని వైసీపీ శ్రేణులతో జగన్ అన్నారు. 2019తో పోలిస్తే 10 శాతం ఓట్లు తగ్గాయని తెలిపారు. ఆ పది శాతం జనాలు కూడా చంద్రబాబు మోసాలను, ప్రలోభాలను ఇట్టే గుర్తిస్తారని అన్నారు. ప్రతి కుటుంబానికి మనం చేసిన మంచి ఏంటో తెలుసుని.. విశ్వసనీయతకు మనమే చిరునామా అని అన్నారు. మనం చేసిన మంచే మనకు శ్రీరామరక్ష అని, మనం అందించే పాలనను ప్రజలు మరిచిపోరని చెప్పారు. 2029లో వైసీపీనే ప్రజలు అధికారంలోకి తెచ్చుకుంటారని అన్నారు.
తనకు వయసుతో పాటు సత్తువ కూడా ఉందని జగన్ అన్నారు. చంద్రబాబు పాపాలు పండే కొద్దీ.. ప్రజలతో కలిసి చేసే పోరాటాల్లో తనతో ఎవరూ సాటిరారు అని చెప్పారు. అసెంబ్లీలో మనకు వచ్చిన సంఖ్యాబలం తక్కువే కాబట్టి.. అసెంబ్లీలో మనం చేసేది కూడా తక్కువే అని అన్నారు. అసెంబ్లీలో మనం ఏదో చేస్తామనో నమ్మకం లేదని.. అందుకే ప్రజలకు చేరువై పోరాటాలు చేద్దామని పిలుపునిచ్చారు.
టీడీపీకి ఓటు వేయలేదని దాడులు చేస్తున్నారని.. రెడ్ బుక్స్ అంటూ హోర్డింగ్లు పెడుతున్నారని మండిపడ్డారు. ఓడిపోయామన్న భావనను మనసులో నుంచి తీసేయాలని వైసీపీ శ్రేణులకు జగన్ సూచించారు. న్యాయంగా ధర్మంగా మనం ఓడిపోలేదని చెప్పారు. ప్రతి ఇంట్లో వైసీపీ చేసిన మంచి ఉందని.. ప్రతి ఇంటికీ కూడా తలెత్తుకుని పోగలమని తెలిపారు. చెప్పిన పని చేశాం కాబట్టి ప్రజల మధ్యకి గౌరవంగా వెళ్లగలుగుతామని సూచించారు. కాలం గడుస్తున్న కొద్దీ మన పట్ల అభిమానం వ్యక్తమవుతుందని, మళ్లీ రికార్డు మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.అప్పటిదాకా మోసపోతున్న వారికి అండగా నిలబడాలని సూచించారు. కార్యకర్తలకు మనం ఎప్పుడూ తోడుగా ఉండాలన్నారు. దాడులకు గురైన వారికి భరోసా ఇవ్వాలన్నారు. రాబోయే రోజుల్లో నేను కార్యకర్తలను కలుస్తానని చెప్పారు.