Srisailam | కార్తీక మాసోత్సవాల్లో భాగంగా శ్రీశైల మహాక్షేత్రంలో దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మ పథం (నిత్య కళారాధన కార్యక్రమంలో భాగంగా) గురువారం విశాఖ పట్నం వాసి కే సునీత బృందం సంప్రదాయ నృత్య ప్రదర్శన నిర్వహించారు. ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్య కళారాధన వేదిక వద్ద గురువారం సాయంత్రం ఈ సంప్రదాయ నృత్య కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గణపతి ప్రార్ధన, మూహిక వాహన, భో.. శంభో.. అదిగదిగో శ్రీశైలం, లలితా సాహస్ర వైభవం తదితర గీతాలకు నివేదిత, శ్రీకాంత్, విధిజ్ఞ, భవజ్ఞ, చైత్రిక, వైష్ణవి, మధు శ్రీ, దివ్య శ్రీ, శ్రీ వల్లి, జయ నందిని, యశస్విని తదితరులు నృత్య ప్రదర్శన చేశారు.
ఈ నిత్య కళారాధనలో ప్రతి రోజూ హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తి రంజని తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్వామి అమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరుగాలని, ప్రాచీన, సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ నిత్య కళారాధనా కార్యక్రమాలను శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తోంది.