తిరుమల : ఈనెల 16న శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం సందర్భంగా 15,16 రెండు రోజులపాటు బ్రేక్దర్శనాలు (VIP Break Darsan) రద్దు చేస్తున్నట్లు టీటీడీ (TTD) అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా జూలై 15న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కారణంగా రెండు రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశామన్నారు. జూలై 14, 15వ తేదిల్లో ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని భక్తులు సహకరించాలని కోరారు.
కొనసాగుతున్న భక్తుల రద్దీ..
కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమలకు భక్తుల తాకిడి కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్టుమెంట్లు నిండిపోయి ఎన్జీ షెడ్స్ వరకు క్యూలైన్లో నిలబడ్డారు.
టోకెన్లు ఉన్న భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 70,011 మంది భక్తులు దర్శించుకోగా 28,496 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న మొక్కుల ద్వారా శ్రీవారి హుండీకి రూ. : 3.53 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.