Vijayasai Reddy | వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ చుట్టూ కోటరీ ఉందని.. దాంతో ఆయనకు తీవ్ర నష్టం జరుగుతుందని, దాని నుంచి బయటపడకపోతే రాజకీయ భవిష్యత్ ఉండదని ఆ పార్టీ మాజీ నేత విజయ సాయిరెడ్డి అన్నారు. కాకినాడ పోర్టులో వాటాలను అక్రమంగా బదిలీ చేయించుకున్నారనే కేసులో విజయవాడ సీఐజీ రీజనల్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. విచారణ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్సీపీలో తనను ఎదగకుండా కొందరు కిందకు లాగారని ఆరోపించారు. తన మనసులో జగన్‌కు సుస్థిరమైన స్థానం ఉందన్నారు. జగన మనసులో మాత్రం తనకు స్థానం లేదని.. అందుకే పార్టీ నుంచి బయటకు వచ్చానన్నారు. కోటరీ కారణంగానే తాను జగన్‌కు దూరమయ్యానని చెప్పుకొచ్చారు.
కోటరీ మాటలు వినొద్దని తాను జగన్‌కు చెప్పానని.. భవిష్యత్‌లో మళ్లీ ఆ పార్టీలోకి వెళ్లే అవకాశం లేదన్నారు. విరిగిన మనసు మళ్లీ అతుక్కోదని.. ప్రస్తుతం తాను ఏ పార్టీలో చేరాలనేదానిపై నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. నాయకుడనే వ్యక్తి చెప్పుడు మాటలు వినొద్దని.. అలాంటి వ్యక్తి నాయకుడే కాదన్నారు. ప్రజలు, పార్టీకి నష్టపోకతప్పదని.. తనకు, జగన్‌కు మధ్య కొందరు విభేదాలు సృష్టించారన్నారు. కోటరీకి అనుకూలంగా ఉంటేనే జగన్ వద్దకు తీసుకెళ్తారని.. జగన్ వద్దకు వెళ్లాలంటే కోటరీకి లాభం చేకూర్చాల్సిందేనన్నారు. పార్టీ నుంచి బయటకు వచ్చినా జగన్ బాగుండాలని తాను కోరుకుంటున్నానని విజయ సాయిరెడ్డి పేర్కొన్నారు. ఎవరు నిజాలు చెబుతున్నారో.. ఎవరు అబద్ధాలు చెబుతున్నారో అర్థం చేసుకొని.. కోటరీ నుంచి బయటపడాలన్నారు. జగన్‌తో మాట్లాడిన సందర్భంలోనూ ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పినట్లు గుర్తు చేశారు. తనకు పార్టీలో అని పదవులు ఇచ్చారని.. దాన్ని కాదనడం లేదని, కానీ తనను ఎన్నో విధాలా అవమానించారని, కష్టపెట్టారని వాపోయారు. పార్టీలో ఉండాలని జగన్ కోరినా తాను అందుకు ఒప్పుకోలేదన్నారు.
కాకినాడ పోర్టుల బదిలీ వ్యవహారంలో కర్త, కర్మ, క్రియ అన్నీ వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్‌రెడ్డేనని విజయ సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. తనకు ఈ కేసులో సంబంధం లేదన్నారు. ఈ వ్యవహారంలో కీలక వ్యక్తి విక్రాంత్ రెడ్డి.. సుబ్బారెడ్డి తనయుడిగానే విక్రాంత్ రెడ్డి తనకు తెలుసని సీఐడీ అధికారులకు చెప్పినట్లు తెలిపారు. కామన్ ఫ్రెండ్ ద్వారా కేవీ రావును విక్రాంత్ రెడ్డికి పరిచయం చేశానని.. పోర్టు యజమాని కేవీరావుతో తనకు ఎలాంటి లావాదేవీలు జరుగలేదన్నారు. జగన్‌ను కాపాడేందుకు మీరంతా ప్రయత్నిస్తున్నారా? అని సీఐడీ అధికారులు ప్రశ్నించారని.. ఈ కేసుతో జగన్‌కు సంబంధం లేదని చెప్పానన్నారు. కేవీ రావుకు, వైవీ సుబ్బారెడ్డికి మంచి సాన్నిహిత్యం ఉందన్నారు.
సుబ్బారెడ్డి అమెరికాకు ఎప్పుడు వెళ్లినా కాలిఫోర్నియాలో కేవీ రావుకు చెందిన ఓ రాజభవనంలో ఉండేవారని. పోర్టు వ్యవహారంతో జగన్‌కు ఏమాత్రం సంబంధం లేదని.. ఇది రాజకీయ ప్రేరేపితమైన కేసు అని స్పష్టం చేశారు. ఆది నుంచి అంతం వరకు పోర్టు వాటాల వ్యవహారాన్ని డీల్ చేసింది విక్రాంత్ రెడ్డేనని.. కామన్ ఫ్రెండ్స్‌తో కేవీ రావు చెప్పారన్నారు. ఈ వ్యవహారం గురించి తనకు పూర్తి అవగాహన ఉందని, సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెబుతానన్నారు. కేవీ రావు రాజకీయ బ్రోకర్ అని.. ఆయనంటే తనకు అసహ్యమన్నారు. తాను వ్యవసాయం చేసుకుంటున్నానని.. ఇప్పుడు అదే పనిలో ఉన్నానన్నారు. గతంలో నాయకుడిపై భక్తి ఉండేదని.. ప్రస్తుతం దేవుడిపై భక్తి ఉందని చెప్పారు. తాను ప్రలోభాలకు లొంగిపోయానని జగన్ అన్నారని.. తాను ప్రలోభాలకు లొంగలేదన్నారు. భవిష్యత్‌లో తనపై విమర్శలు, ఆరోపణలు చేసినా పట్టించుకోనని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.