Vijayawada | తల్లిదండ్రులు జన్మనిస్తే.. వైద్యులు పునర్జన్మను ఇస్తారని పెద్దలు అంటుంటారు. ఈ సంఘటన వింటే అది అక్షరాల సత్యమని ఒప్పుకుంటారు. కరెంటు షాక్ తగలడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆరేండ్ల పిల్లాడికి ఓ లేడీ డాక్టర్ వెంటనే ఆయువు పోసింది. చలనం లేకుండా పడిపోయిన కుమారుడిని రక్షించుకోవాలనే తపనతో భుజాన వేసుకుని రోడ్డుపై పరుగులు పెడుతున్న తల్లిదండ్రులను గమనించి.. బాలుడికి రోడ్డుపైనే సీపీఆర్ చేసి ప్రాణాలు రక్షించింది. ఆ మహిళా డాక్టర్ చేసిన పనికి ఇప్పుడు అందరూ హ్యాట్సాఫ్ చెబుతున్నారు. విజయవాడలోని అయ్యప్పనగర్‌లో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
విజయవాడ అయ్యప్ప నగర్‌కు చెందిన సాయి అనే ఆరేండ్ల బాలుడు మే 5వ తేదీన సాయంత్రం ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురయ్యాడు. కరెంట్ షాక్ తగలడంలో ఒక్కసారిగా గుండె ఆగిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. చలనం లేకుండా పడిపోయిన బాలుడిని చూసి ఏడుస్తూ భుజాల మీదనే మోసుకుంటూ ఆస్పత్రికి పరుగులు పెట్టారు. అదే సమయంలో మెడ్‌సీ ఆస్పత్రిలోవ ఇధులు నిర్వహిస్తున్న డాక్టర్ నన్నపనేని రవళి అటుగా వెళ్లసాగింది.
ఈ క్రమంలో బాలుడిని భుజాల మీద వేసుకుని వెళ్లడం చూసి ఏమైందని ఆరా తీసింది. వెంటనే బాలుడిని పరీక్షించిన రవళి.. అక్కడే రోడ్డుపై పడుకోబెట్టి సీపీఆర్ చేశారు. బాలుడి ఛాతిపై రవళి చేతితో ఒత్తుతూ.. అక్కడున్న మరో వ్యక్తిని నోటితో గాలి ఊదమని సూచించింది. ఇలా దాదాపు ఏడు నిమిషాల పాటు సీపీఆర్ చేసిన తర్వాత బాలుడిలో చలనం వచ్చింది. ఆ వెంటనే ద్విచక్రవాహనంపై బాలుడిని దగ్గరలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ సమయంలో బాలుడికి శ్వాస అందేందుకు తలను కిందకు ఉంచి పడుకోబెట్టి తీసుకెళ్లమని చెప్పారు.
విద్యుత్ షాక్‌తో ఆగిన ఆరేళ్ల బాలుడి గుండె.. సీపీఆర్ చేసి ప్రాణాలు రక్షించిన డాక్డర్
విజయవాడ – అయ్యప్పనగర్‌లో సాయి(6) అనే బాలుడు రోడ్డు మీద విద్యుత్ షాక్ తగిలి గుండె ఆగిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు.
అటుగా వెళ్తున్న డాక్టర్ రవళి చూసి బాలుడికి సీపీఆర్ చేసి బాలుడి ప్రాణాలు… pic.twitter.com/qeLQ2tJRbv
— Telugu Scribe (@TeluguScribe) May 17, 2024
రవళి చెప్పినవిధంగానే పడుకోబెట్టుకొని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ట్రీట్మెంట్ తర్వాత బాలుడి పూర్తిగా కోలుకున్నాడు. అయితే డాక్టర్ రవళి సీపీఆర్ చేస్తుండగా.. అక్కడే ఉన్న కొంతమంది వీడియో తీశారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్‌గా మారడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కాగా, ఈ వీడియో చూసిన వాళ్లందరూ కూడా డాక్టర్ రవళిని ప్రశంసిస్తున్నారు.