Vijayawada | విజయవాడ దుర్గగుడి ఘాట్ రోడ్డును అధికారులు మూసివేశారు. భారీ వర్షాల కారణంగా ఘాట్ రోడ్డులోని కొండచరియలు విరిగిపడుతుండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. శనివారం రాత్రి నుంచే ఘాట్ రోడ్డు మార్గాన్ని మూసివేసినట్లుగా అధికారులు తెలిపారు.
ఘాట్ రోడ్డు మూసివేసిన నేపథ్యంలో మహామండపం నుంచి మాత్రమే ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులను అనుమతిస్తున్నారు. దుర్గా ఘాట్ నుంచి దేవస్థానం బస్సులను మాత్రమే అనుమతిస్తున్నారు. కాగా, ఆషాఢ మాసం సందర్భంగా, పైగా ఆదివారం కావడంతో సారె సమర్పించేందుకు వచ్చే భక్తులతో ట్రాఫిక్ చాలాసేపు నిలిచిపోయింది. దీంతో దుర్గమ్మ భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షంలోనూ ఆలయానికి భక్తులు పోటెత్తారు.
తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. దీంతో తిరుమల బాట గంగమ్మ ఆలయం వద్ద ఉన్న పెద్ద చెట్టు కూలిపోయింది. దీంతో పార్కింగ్‌లో ఉన్న వాహనాలు ధ్వంసమయ్యాయి. అయితే భక్తులకు ఎటువంటి గాయాలు కాలేదు. కాగా, రెండు రోజుల క్రితం తిరుమలలోని జూపాలి తీర్థం దగ్గర చెట్టు కొమ్మ విరిగి ఓ భక్తురాలి మీద పడటంతో తీవ్రగాయాలయ్యాయి.