AP Liquor Case | ఏపీ లిక్కర్ స్కాం కేసులో నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టులో చుక్కెదురైంది. నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై శుక్రవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం వాటిని కొట్టివేసింది.
ఏపీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన తమకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ నిందితులురాజ్ కసిరెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్య, బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ కృష్ణ, వెంకటేశ్ నాయుడు గతంలో వేర్వేరుగా పిటిషన్లు వేశారు. వీటిపై శుక్రవారం నాడు విజయవాడ ఏసీబీ కోర్టు విచారణ జరిపింది. ఇరువర్గాల వాదనలు విన్న అనంతరం న్యాయస్థానం.. బెయిల్ పిటిషన్లను డిస్మిస్ చేసింది.
ఏపీ లిక్కర్ కేసులో ఇప్పటివరకు 12 మందిని అరెస్టు చేయగా ఐదుగురు బెయిల్పై విడుదలయ్యారు. మరో ఏడుగురు జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. వారిలో రాజ్ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, భూనేటి చాణిక్య, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేశ్ నాయుడు విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ కృష్ణలు గుంటూరు సబ్ జైలులో ఉన్నారు.