Srisailam temple | లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ ఈ నెల 10న పుష్యశుద్ధ ఏకాదశి సందర్భంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారలకు విశేష పుష్పార్చన జరిపించనున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. గులాబీ, చేమంతి, సుగంధాలు, నూరువరహాలు, కాగడా మల్లెలు, సన్నజాజులు, విరజాజులు, గన్నేరు, కనకాంబరం, సంపంగి, తామర మొదలైన పుష్పాలు, బిల్వం, దవనం, మరువం, మొదలైన పత్రాలతో శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషంగా పూజాదికాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సుమారు నాలుగువేల కిలోలు.. 40 రకాల పుష్పాలను పుష్పార్చనకు వినియోగించనున్నట్లు తెలిపారు. అదేరోజు సాయంత్రం 6 గంటలకు అక్కమహాదేవి అలంకార మండపంలో స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు పుష్పార్చన జరిపించనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా చతుర్వేద పారాయణలు ఉంటాయని.. దేవస్థాన పండితులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మరో 15 మంది వేదపండితులు కూడా ఈ పారాయణాల్లో పాల్గొంటారని వివరించారు. జ్యోతిర్లింగ స్వరూపుడైన మల్లికార్జునస్వామి స్వామి పుష్ప ప్రియుడని ప్రతీతి. మల్లికాపుష్పాలతో పూజింపబడిన కారణంగానే స్వామివారికి మల్లికార్జునుడనే పేరు వచ్చింది. యుగ యుగాల నుంచి కూడా కరవీరుడు, పుష్పదంతుడు, చంద్రవతి మొదలైన భక్తులెందరో స్వామివారికి పుష్ప కైంకర్యాన్ని చేసి తరించారు. మహాశక్తి స్వరూపిణి అయిన భ్రమరాంబాదేవి వారికి కూడా పుష్పార్చన ప్రీతికరం. లోక కల్యాణం కోసం పుష్యశుద్ధ ఏకాదశి స్వామిఅమ్మవార్లకు ఈ పుష్పార్చన నిర్వహించేందుకు దేవస్థానం నిర్ణయించింది. పుష్ప కైంకర్యానికి అవసరమైన పుష్పాలన్నింటిని పుంగనూరుకు చెందిన రామచంద్ర యాదవ్ విరాళంగా అందజేయనున్నారు.
జనవరి 10న ముక్కోటి ఏకాదశి సందర్భంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారలకు ప్రత్యేక ఉత్సవం నిర్వహించనున్నారు. వేకువ జామున స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను ఉత్తరద్వార దర్శనం, రావణవాహనసేవ నిర్వహించనున్నారు. ఈ ఉత్సవంలో భాగంగానే ఆలయ ముఖమండప ఉత్తరద్వారం నుంచి వెలుపలకు ఉత్సవమూర్తులను తోడ్కొనివచ్చి ఆలయ ఉత్తరభాగంలో రావణవాహనంపై ఆశీనులను చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ముక్కోటి ఏకాదశి రోజు ఉదయం 3 గంటలకు ఆలయద్వారాలను తెరుస్తారు. మంగళవాయిద్యాల అనంతరం 3.30 గంటకకు స్వామివారికి సుప్రభాతసేవ, 4.30 గంటలకు ప్రాతఃకాల పూజలు జరిపించి.. మంగళహారతి ఇవ్వనున్నారు. అనంతరం 5.30 గంటలకు రావణవాహన సేవ జరుగుతుంది. అనంతరం గ్రామోత్సవం నిర్వహించనున్నారు. 6 గంటల తర్వాత సర్వదర్శనాలు, ఆర్జితసేవలు ప్రారంభంకానున్నాయి.