సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్‌కుమార్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కోరారు. తనను కస్టోడియల్ హింసకు గురి చేసిన కేసులో నిందితుడైన సునీల్‌కుమార్ సాక్షులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఆయన్ను వెంటనే కస్టడీలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు ఆదివారం లేఖ రాశారు.
గతంలో తనను అక్రమంగా అరెస్టు చేసి జగన్ ప్రభుత్వం వేధింపులకు గురి చేసిందని రఘురామకృష్ణ రాజు అన్నారు. వైసీపీ పాలనలో తనపై మూడుసార్లు హత్యాయత్నం జరిగిందని పేర్కొన్నారు. తన ఫిర్యాదు ఆధారంగా అప్పటి సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్, ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, నాటి సీఎం వైఎస్ జగన్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ విజయపాల్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ నీలం ప్రభావతి, మరికొందరిపై నిందితులుగా చేర్చి వారిపై పట్టాభిపురం పీఎస్‌లో జూలై 11వ తేదీన హత్యాయత్నం కేసు నమోదు చేశారని తెలిపారు.
ఈ కేసు దర్యాప్తు బృందం ఇప్పటికే ఆధారాలు సేకరించిందని.. తన నుంచి, పలువురు సాక్షుల నుంచి వాంగ్మూలాలు సేకరించిందని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి ఇటీవల కథనాలు వచ్చిన నేపథ్యంలో పీవీ సునీల్‌కుమార్ కీలక సాక్షులుగా ఉన్న పోలీసులు, వైద్యులను బెదిరిస్తున్నారని తెలిపారు. ఆయన్ను వెంటనే అదుపులోకి తీసుకోవాలని ఆ లేఖలో పేర్కొన్నారు.