Srisailam | ప్రసిద్ద జ్యోతిర్లింగ మహాశక్తి పీఠం కొలువైన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల క్షేత్రాన్ని భూమండలానికే నాభిస్థానంగా సూచిస్తారు. స్వామి అమ్మవార్ల సన్నిధిలో నూతన తెలుగు సంవత్సరాది పంచాగ పఠన కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యం ఉన్నది. నూతన సంవత్సర ఉగాది మహోత్సవాల్లో భాగంగా స్వస్తి శ్రీ శోభకృత్ నామ సంవత్సర పంచాగ శ్రవణ కార్యక్రమం జరుగుతుంది.
బుధవారం ఉదయం 9.00 గంటల నుండి దేవస్థాన ఆస్థాన సిద్దాంతి పండిత శ్రీ బుట్టే వీరభద్ర దైవఙ్ఞశర్మ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం, పంచాంగ వితరణ, పండిత సత్కారాలు జరుగుతాయి. సాయంత్రం 5.00గంటలకు రథాంగ పూజ, రథాంగ హోమం, రథాంగ సాత్విక బలి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
అటుపై దేవదేవులకు అత్యంత వైభవంగా రథోత్సవం నిర్వహిస్తామని శ్రీశైలం ఈవో లవన్న తెలిపారు. బుధవారం సాయంత్రం జరిగే రథోత్సవంలో శ్రీ భ్రమరాంబ దేవి శ్రీరమావాణీ సేవిత రాజేశ్వరి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారని అర్చక వేదపండితులు చెప్పారు. కన్నడిగులకు ప్రధానమైన ఈ ఘట్టంలో లక్ష మందికి పైగా భక్తులు పాల్గొనే అవకాశం ఉన్నట్లు అధికారుల అంచనా.