Vijayawada | దసరా శరన్నవరాత్రుల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిలోని కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్లిన భక్తులకు చేదు అనుభవం ఎదురైంది. లాడ్జిలో స్నానం చేస్తుండగా ఓ యువకుడు వీడియోలు తీశాడు. ఇది గమనించిన యువతి కేకలు వేయడంతో సదరు వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు.
వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ కుటుంబం ఇటీవల కనకదుర్గమ్మ దర్శనానికి విజయవాడకు వెళ్లింది. గత నెల 26న విజయవాడ గవర్నర్‌పేటలోని ఓ హాటల్(లాడ్జి)లో బస చేసింది. ఆ సమయంలో వారికి హోటల్లో 303 నెంబర్ గదిని కేటాయించారు. ఆ గదిలోని బాత్రూంలో యువతి స్నానం చేస్తుండగా 304 గది వెంటిలేటర్ నుంచి ఓ యువకుడు వీడియో చిత్రీకరించాడు. అయితే ఇది గమనించి సదరు యువతి గట్టిగా కేకలు వేసింది. దీంతో అప్రమత్తమైన కుటుంబసభ్యులు సదరు యువకుడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా అక్కడి నుంచి పరారయ్యాడు.
దీనిపై బాధితులు ఈ నెల 29వ తేదీన గవర్నర్‌పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితురాలి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇద్దరు యువకులపై కేసు నమోదు చేశారు.