Prakasham Barrage | ప్రకాశం బ్యారేజి గేట్లను బోట్లు ఢీకొట్టిన ఘటనను ఏపీ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఇందులో కుట్ర కోణం ఉందనే అనుమానంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు పలు విషయాలను తెలుసుకున్నారు. ప్రకాశం బ్యారేజి గేట్లను ఢీకొట్టిన పడవలు వైసీపీ నేతలవేనని గుర్తించారు. ఈ క్రమంలోనే ఇద్దరు నిందితులను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు.
ప్రకాశం బ్యారేజిని ఢీకొట్టిన పడవల్లో మూడింటిని కుక్కలగడ్డ ఉషాద్రికి చెందినవిగా పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే. దీంతో ఉషాద్రిని పోలీసులు ఆరెస్టు చేశారు. ఆయనతో పాటు సూర్యపాలెం వాసి కోమటిరెడ్డి రామ్మోహన్ను కూడా అరెస్టు చేసి విజయవాడ కోర్టుకు తరలించారు.
భారీ వరదల నేపథ్యంలో ఈ నెల 1వ తేదీన బ్యారేజి కౌంటర్ వెయిట్లను పలు బోట్లు ఢీకొట్టాయి. దీంతో 67, 69, 70 గేట్ల వద్ద సుమారు 17 టన్నుల కౌంటర్ వెయిట్లు ధ్వంసమయ్యాయి. ఇందులో మూడు పడవలపై వైసీపీ పార్టీ రంగులు ఉండటం పలు అనుమానాలకు తావిచ్చింది. పైగా ఆ బోట్ల కోసం ఇప్పటివరకు వాటి యజమానులు ఎవరూ రాలేదు. దీంతో పడవలు కొట్టుకురావడంలో యజమానుల నిర్లక్ష్యంతో పాటు.. ఏదైనా కుట్ర కోణం ఉందా అని అనుమానించారు. ఈ క్రమంలోనే దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. వైసీపీ నేతల కుట్ర ఉందని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ మేరకు నివేదికను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి అందజేశారు.