అమరావతి : పొలం పనులకు వెళ్లాలనే తొందరలో రహదారిపై రాంగ్రూట్లో వెళ్లి ఆగి ఉన్న లారీని ఢీకొన్న సంఘటనలో ఇద్దరు రైతులు మృతి చెందిన సంఘటన విజయనగరం జిల్లా కొత్తవలస మండలం అడ్డూరువానిపాలెంలో జరిగింది. విశాఖజిల్లా దేవరాపల్లి మండలం వంతివానిపాలెం, చింతలపూడి గ్రామాలకు చెందిన అచ్చయ్య(35), చిన్నదేముడు(40) అనే రైతులు ఆనందపురం మండలం జోడువానిపాలెంలో మంగళవారం జరిగిన గ్రామ దేవత జాతరకు బంధువుల ఇంటికెళ్లారు.
రాత్రి బంధువుల ఇంటిలో ఉండి, తెల్లవారుజామున ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి బయలుదేరారు. విశాఖ – అరకు జాతీయ రహదారిపై రాంగ్రూట్లో వెళ్లిన వీరు ఆగి ఉన్న లారీని ఢీకొట్టారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.