AP News | ఏపీలో వైసీపీతో అంటకాగిన పలువురు డీఎస్పీలపై బదిలీ వేటు పడింది. తాడిపత్రి, రాజంపేటలో వైసీపీ కోసం పనిచేసిన డీఎస్పీ వీఎన్కే చైతన్యను బదిలీ చేసింది. అలాగే తుళ్లూరు డివిజన్ డీఎస్పీ ఈ.అశోక్‌కుమార్ గౌడ్‌ను కూడా వేటు పడింది. అయితే ఇద్దరికీ ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. పోలీసు ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు డీజీపీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
తాడిపత్రి డీఎస్పీగా పనిచేసినప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన అనుచరులను చైతన్య వేధించారనే ఆరోపణలు వచ్చాయి. అప్పటి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చెప్పినట్లుగా వింటూ జేసీ ప్రభాకర రెడ్డితో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలపై భౌతిక దాడులకు దిగారని విమర్శలు ఉన్నాయి. రాజంపేటకు బదిలీ అయిన తర్వాత కూడా తాడిపత్రికి వచ్చి మరీ జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులపై దాడి చేశారని చైతన్యపై ఆరోపణలు ఉన్నాయి. తాడిపత్రిలో బాధితులు చైతన్యపై 23 ప్రైవేటు కేసులు కూడా దాఖలయ్యాయి.
నూజివీడు డీఎస్పీగా పనిచేసిన సమయంలో అశోక్‌కుమార్ గౌడ్ వైసీపీకి కొమ్ముకాశారనే ఫిర్యాదులు ఉన్నాయి. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను బహిరంగంగానే హెచ్చరించారు.