Kurnool Bus Accident | కర్నూలు బస్సు ప్రమాదంలో విస్తుపోయే నిజాలు బయటకొచ్చాయి. కర్నూలు సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఓ బైక్‌ను హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో మంటలు చెలరేగి 19 మంది సజీవ దహనమయ్యారు. అయితే పోలీసుల విచారణలో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. బస్సు ఢీకొట్టడానికి ముందు బైక్ డివైడర్‌ను ఢీకొట్టి పడిపోయిందని తెలిసింది.
బస్సు ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ప్రమాదస్థలికి సమీపంలోని సీసీటీవీ ఫుటేజిలను పరిశీలించగా.. యాక్సిడెంట్ జరగడానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ పెట్రోల్ బంక్‌కు బైకర్ శివశంకర్ వెళ్లినట్లు తెలిసింది. ఆ సమయంలో శివశంకర్ తాగి ఉండటంతో పాటు, అతనితో మరో వ్యక్తి కూడా ఉన్నట్లు గుర్తించారు. అయితే ప్రమాదం జరిగిన తర్వాత అతను అదృశ్యం అవ్వడంతో.. సీసీటీవీ ఫుటేజీ ప్రత్యక్ష సాక్షుల ద్వారా రెండో వ్యక్తిని ఎర్రిస్వామిగా గుర్తించారు. చివరకు ఎర్రస్వామిని పట్టుకుని పోలీసులు విచారించగా ప్రమాదం జరిగిన తీరును వివరించారు. బస్సు స్పాట్‌కు రాకముందే అదుపుతప్పి తమ బైక్ డివైడర్‌ను ఢీకొట్టిందని తెలిపాడు. దీంతో శివశంకర్ అక్కడికక్కడే చనిపోయాడని పేర్కొన్నాడు.
రోడ్డుకు అడ్డంగా ఉన్న బైక్‌ను పక్కకు లాగేందుకు ప్రయత్నిస్తుండగా.. వెనుక వచ్చిన బస్సు లాక్కెళ్లిపోయిందని ఎర్రిస్వామి చెప్పాడు. బైక్ ఇరుక్కుపోవడంతో స్కార్క్ రావడం ప్రారంభమైందని.. అది గమనించని డ్రైవర్ అలాగే కొంత దూరం నడపడంతో మంటలు చెలరేగాయని తెలిపారు. అది చూసి భయపడిపోయి తాను అక్కడి నుంచి పారిపోయినట్లు తెలిపారు. కాగా, ఎర్రిస్వామి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.