హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానంలో (TTD) అన్యమత ఉద్యోగులపై టీటీడీ వేటు వేసింది. ఇతర మతాలకు చెందిన నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. నాణ్యతా విభాగంలో డిప్యూటీ ఇంజినీర్‌గా పనిచేస్తున్న బీ.ఎలిజర్, బర్డ్ దవాఖానలో స్టాఫ్ నర్సు ఎస్.రోసి, గ్రేడ్-1 ఫార్మాసిస్ట్ ఎం. ప్రేమావతి, ఎస్వీ ఆయుర్వేద ఫార్మసీలో విధులు నిర్వహిస్తున్న జీ.అసుంతను సస్పెండ్ చేశారు. క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నట్లు నిర్ధారణకు వచ్చిన టీటీడీ.. వారిపై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. హిందూ ధార్మిక సంస్థలో ఉంటూ బాధ్యతారాహిత్యంగా వ్యవహించారని పేర్కొన్నది.
కాగా, ఇటీవల (ఈ నెల 11న) తిరుమల శ్రీ వేంకటేశ్వరుడిని దర్శించుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్.. టీటీడీలో 1000 మందికిపైగా అన్యమతస్తులకు ఉద్యోగాలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. మసీదులు, చర్చిల్లో బొట్టుపెట్టుకునే హిందువులకు కూడా ఉద్యోగాలిస్తారా? చెప్పాలన్నారు. ప్రభుత్వాలు, పాలకులు మారినా ఆ అనవాయితీని ఎందుకు కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే వారిని టీటీడీలో ఉద్యోగాల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో నలుగురు అన్యమతస్తులను టీటీడీ తొలగించడం గమనార్హం.