తిరుమల: తిరుమలలో సర్వదర్శనం టోకెన్ల (SSD Tokens) జారీ మళ్లీ ప్రారంభమైంది. గురువారం తెల్లవారుజాము నుంచి తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాసం, శ్రీనివాసం వద్ద టోకెన్లను టీటీడీ అధికారులు యథావిధిగా ఇస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని జనవరి 10 నుంచి 19 వరకు టికెట్లు, టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు. వైకుంఠ ద్వార దర్శనాలు ముగియడంతో రెండు రోజులుగా తిరుమలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో ఎస్ఎస్డీ టోకెన్ల జారీని టీటీడీ నిలిపివేసింది. వారందరిని వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2లోకి అనుమతించి శ్రీవారి దర్శనం కల్పించారు. వారి దర్శనాలు ముగిసిన నేపథ్యంలో గురువారం తెల్లవారుజాము నుంచి ఏరోజుకారోజు సర్వదర్శనం టోకెన్ల పంపిణీని టీటీడీ పునఃప్రారంభించింది.
నేడు తిరుమలలో అధ్యయనోత్సవాలు ముగియనున్నాయి. ఇవి 2024 డిసెంబర్, 30వ తేదీన ప్రారంభమైన విషయం తెలిసిందే. జనవరి 25న సర్వ ఏకాదశి, 27న మాస శివరాత్రి, 29న శ్రీ పురంధర దాస ఆరాధన మహోత్సవ వేడుకలు జరగనున్నాయి.
మరోవైపు శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులను టోకెన్లు లేకుండా అనుమతించడంపై టీటీడీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఎస్ఎస్డీ టోకెన్లు దక్కించుకోవడానికి భక్తులు పడరానిపాట్లు పడుతున్నారు. అనంతరం దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉండటం కూడా సమస్య అవుతున్నది. దీంతో టోకెన్లు లేకుండా దర్శనాలు కల్పించడంపై అధికారులు ఆలోచిస్తున్నారు.