తిరుపతి : ఉద్యోగుల సంక్షేమానికి, వారి ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నామని టీటీడీ జేఈవో సదా భార్గవి అన్నారు. మంగళవారం తిరుపతిలోని ఎస్వీ హైస్కూల్ మైదానంలో ఆమె క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉద్యోగులు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండి భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించాలని కోరారు.
ఉద్యోగులు కోరిన వెంటనే మైదానం అభివృద్ధి కోసం చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి, ఈవో ఎవి.ధర్మారెడ్డి రూ.84 లక్షలు మంజూరు చేసినట్టు వెల్లడించారు. ప్రస్తుతం క్రికెట్, వాలీబాల్, షటిల్ కోర్టులతోపాటు రిక్రియేషన్ హాల్లో టేబుల్ టెన్నిస్, క్యారమ్స్, చెస్ క్రీడలు ఆడేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.
ఆరు నెలల్లో ఇతర క్రీడా పరికరాలను సమకూర్చి, గోడలకు క్రీడాంశాలతో కూడిన చక్కటి పెయింటింగ్ తో మైదానాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ విభాగం డిప్యూటీ ఈవో స్నేహలత, ఈ ఈ మురళి ఉద్యోగులు పాల్గొన్నారు. రిక్రియేషన్ హాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన టేబుల్ టెన్నిస్ టేబుల్ ను జేఈవో ప్రారంభించారు.