YS Jagan | ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తిరుమల పర్యటన ఇప్పుడు ఉత్కంఠగా మారింది. శ్రీవారి లడ్డూ వివాదం నేపథ్యంలో తిరుమలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించాలని జగన్ నిర్ణయించుకున్నారు. కానీ ఒక క్రైస్తవుడు అయిన జగన్ తిరుమలకు వస్తుండటంతో డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో జగన్ నుంచి డిక్లరేషన్ తీసుకోవాలని టీటీడీ కూడా నిర్ణయించింది.
శ్రీవారి దర్శనం కోసం వచ్చే ఇతర మతస్థుల మాదిరిగానే జగన్ నుంచి డిక్లరేషన్ తీసుకునేందుకు టీటీడీ అధికారులు సిద్ధమయ్యారు. ఈ మేరకు ముందుగానే అతిథి గృహానికి వెళ్లి ఆయన నుంచి డిక్లరేషన్ ఫారం అందించాలని అనుకుంటున్నారు. జగన్ సంతకం చేస్తేనే దర్శనానికి అనుమతిస్తామని.. తిరస్కరిస్తే దేవాదాయ శాఖ చట్ట ప్రకారం నడుచుకుంటామని టీటీడీ అధికారులు చెప్పారు.
షెడ్యూల్ ప్రకారం ఈ నెల 27వ తేదీ సాయంత్రం 4.50 గంటలకు వైఎస్ జగన్ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి సాయంత్రం 5 గంటలకు తిరుమలకు బయల్దేరతారు. రాత్రి 7 గంటలకు తిరుమలకు చేరుకుంటారు. రాత్రి అక్కడే గెస్ట్ హౌస్లో బస చేసి.. మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు తిరుమల ఆలయానికి వెళ్లి.. శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం 11.30 గంటలకు ఆలయం నుంచి గెస్ట్ హౌస్కు బయల్దేరతారు. 11.50 గంటలకు తిరుమల నుంచి రేణిగుంట విమానాశ్రయానికి వెళ్తారు. 1.30 గంటలకు రేణిగుంట నుంచి బెంగళూరులోని తన నివాసానికి చేరుకుంటారు.
జగన్ పర్యటన నేపథ్యంలో తిరుపతిలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నెల్లూరు, చిత్తూరు, అనంతపురం నుంచి భద్రతబలగాలను రప్పించారు. ఈ క్రమంలోనే జిల్లావ్యాప్తంగా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నామని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. సెప్టెంబర్ 25వ తేదీ నుంచి అక్టోబర్ 24వ తేదీ వరకు పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. ఈ సమయంలో పోలీసుల అనుమతి లేకుండా ఎటువంటి సభలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించకూడదని చెప్పారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.