TTD | తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. అక్టోబర్ 4వ తేదీన ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. సాలికట్ల బ్రహ్మోత్సవాలకు సంబంధించి శనివారం నాడు ఈవో శ్యామలరావు సమీక్ష నిర్వహించారు.
అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తున్నామని తెలిపారు. అలాగే వసతి గదుల సిఫార్సు లేఖలు, దాతలకు కేటాయింపు రద్దు చేశామని చెప్పారు. బ్రహ్మోత్సవాల్లో లడ్డూల కొరత లేకుండా 7 లక్షల లడ్డూలను అదనంగా ఉంచడం జరుగుతుందని పేర్కొన్నారు. అక్టోబర్ 8వ తేదీన సాయంత్రం 6 గంటలకు గరుడ వాహన సేవ ప్రారంభమవుతుందని తెలిపారు. వాహన సేవలు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు.
తిరుమలలో నీటి లభ్యతపై అపోహలు వద్దని ఈవో శ్యామలరావు అన్నారు. గత సంవత్సరం కంటే ఈ ఏడాది నీటి నిల్వలు తగ్గాయని తెలిపారు. 5770 లక్షల గ్యాలన్ల నీటి నిల్వలు ప్రస్తుతం ఉన్నాయని పేర్కొన్నారు. కల్యాణ డ్యామ్‌లో కూడా నీటి నిల్వలు తగ్గాయని చెప్పారు. రోజూ 11 లక్షల గ్యాలన్లు మున్సిపల్ కార్పొరేషన్ టీటీడీకి ఇవ్వడానికి అంగీకరించిందని తెలిపారు.