TTD | టీటీడీ నిర్లక్ష్యం కారణంగా తిరుపతిలోని ఎస్వీ గోశాలలో ఆవులు మృతిచెందాయని మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ ఈవో శ్యామలరావు తీవ్రంగా ఖండించారు. భక్తుల మనోభావాలను భూమన కరుణాకర్ రెడ్డి దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. ఆవులు చనిపోయాయని అసత్య ప్రచారం చేశారని అన్నారు.
టీటీడీ గోశాలలో వంద గోవులు మృతి చెందాయని మాజీ చైర్మన్ భూమన చేసిన వ్యాఖ్యలు కుట్రపూరితంగా ఉన్నాయని శ్యామలరావు అన్నారు. టీటీడీ గోశాలలో ఎలాంటి నిర్లక్ష్యం లేదని, గోవులను తల్లిలా భావించి, ఎప్పటికప్పుడు దాణా అవసరమైన వైద్య సేవలను అందిస్తున్నామని చెప్పారు. ఎక్కడో మృతి చెందిన గోవుల ఫొటోలను, గత పాలనలో గోశాలలో మరణించిన గోవుల ఫొటోలను చూపించి అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత పాలనలో మరణించిన గోవుల ఫొటోలను, తేదీలను మార్చి, ప్రస్తుతం చనిపోయినట్లుగా ఫొటోలను మీడియాకు చూపించారని తెలిపారు. గత మూడు నెలల్లో 43 ఆవులు మాత్రమే అనారోగ్యంతో చనిపోయాయని తెలిపారు. వాటికి పోస్టుమార్టం చేయలేదనడం మాత్రం అవాస్తవమని అన్నారు.
గత ప్రభుత్వ హయాంలో గోశాల నిర్వహణలో అనేక అక్రమాలు జరిగాయని శ్యామలరావు తెలిపారు. మార్చి 2021 నుంచి మార్చి 2024 వరకు భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయని తెలిపారు. నాచు పట్టేసిన నీళ్లనే గోవులకు పట్టించారని పేర్కొన్నారు. పురుగులు పట్టేసి వినియోగించుకోలేని నీళ్లను గోవులకు పట్టిస్తారా అని మండిపడ్డారు. భూమన చైర్మన్గా ఉన్న సమయంలో కాలం చెల్లిన మందులు, పురుగులు పడ్డ దాణాను పంపిణి చేసినట్లు వారి పాలనలో విజిలెన్స్ నివేదిక స్పష్టం చేస్తోందని చెప్పారు. గోశాల ఆవరణలో చెల్లాచెదురుగా మెడిసిన్స్ పడేశారని అన్నారు. హిందువుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశంపై జాగ్రత్తగా ఉండాలి కదా అని ప్రశ్నించారు. గత ఐదేళ్లలో చనిపోయిన ఆవుల వివరాలను దాచిపెట్టారని అన్నారు. ఆవులు లేని గోశాలకు దాణా పేరుతో నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. 2023లో గోశాలకు విజిలెన్స్ అధికారులను రానివ్వలేదని అన్నారు.
2024 జూన్లో ఈవోగా బాధ్యతలు చేపట్టే ముందు తాను సీఎం చంద్రబాబును కలిశానని శ్యామలరావు తెలిపారు. టీటీడీ వ్యవస్థలు పాడయ్యాయని, వాటిని సరిచేయాలని చంద్రబాబు అన్నారని పేర్కొన్నారు. ఈ పది నెలల్లో ఎన్నో ప్రక్షాళన కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. హిందువుల మనోభావాలను అనుగుణంగా వసతులు మెరుగుపరిచామని స్పష్టం చేశారు.