తిరుమల : తిరుమలలో అక్టోబరు 4 నుంచి 12వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల (Brahmotsavam) ఏర్పాట్ల సందర్భంగా టీటీడీ (TTD) ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. తిరుమల (Tirumala) లోని అన్నమయ్య భవనంలో నిర్వహించిన సమీక్షలో అక్టోబరు 8న గరుడసేవ రోజున అదనపు పార్కింగ్ ప్రాంతాల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించాలని విజిలెన్స్ అధికారులను ఈవో ఆదేశించారు.
తిరుమలలో ప్రస్తుతం ఉన్న ప్రాంతాలలో ద్విచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలు కలిపి దాదాపు 11, 000 వాహనాలను పార్క్ చేయడానికి సరిపోతాయని, అదనపు పార్కింగ్ ప్రాంతాల కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. బందోబస్తు, అదనపు సిబ్బంది, సీసీటీవీ, అదనపు లగేజీ సెంటర్ ఏర్పాట్ల కోసం స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకోవాలని పేర్కొన్నారు.
ఇంజినీరింగ్ పనుల పురోగతి, రవాణా, వసతి, నీరు, అన్నప్రసాదాల పంపిణీ, సరిపడా శ్రీవారి సేవకుల ఏర్పాటు, ఉద్యానవన విభాగం అలంకరణలు, లడ్డూల నిల్వ, ఉత్తమ కళా బృందాల ఎంపిక, అదనపు మరుగుదొడ్లు తదితర అంశాలపై చర్చించారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో 13 కంపార్టుమెంట్లు నిండిపోగా టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 60,694 మంది దర్శించుకోగా 27,350 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.78 కోట్లు వచ్చిందని తెలిపారు.