హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు తిరుపతిలోని ఇతర అనుబంధ ఆలయాల్లో స్వామివారికి భక్తులు కానుకలుగా ఇచ్చిన మొబైల్ ఫోన్లను వేలం వేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. శ్రీవారికి కానుకగా భక్తులు సమర్పించిన 74లాట్ల మొబైల్ ఫోన్లను ఈనెల 21, 22న టీటీడీ తమ అధికారిక వెబ్సైట్ నుంచి ఆన్లైన్ ద్వారా ఈ -వేలం వేయనున్నట్టు పేర్కొన్నది.
ఈ ఫోన్లను ఖరీదు చేయాలనుకునే ఆసక్తి కల్గిన భక్తులు ఏపీ ప్రభుత్వ ఈ-కొనుగోలు పోర్టల్‌లో రిజిస్టర్ అవ్వాలని టీటీడీ సూచించింది. ఇలా రిజిస్టర్ అయిన వ్యక్తులు బిడ్డర్లు వేలంలో పాల్గొనటానికి అర్హులని, ఈ వేలానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం స్థానిక జనరల్ మేనేజర్ లేదా ఏఈవోలను సంప్రదించాలని కోరింది. లేదా తిరుపతిలో టీటీడీ, హరేకృష్ణమార్గ్, https//konugolu.ap.gov.inap.gov.in లేదా టీటీడీ వెబ్సైట్ www.tirumala.org లేదా 0877 – 2264429 నంబర్‌ను సంప్రదించాలని టీటీడీ సూచించింది.