TTD | వైకుంఠ ఏకాదశి సందర్భంగా సర్వదర్శనం టోకెన్లు జారీలో ఈ నెల 8న జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డ బాధితులకు స్విమ్స్ డైరెక్టర్ చాంబర్లో ఏడుగురు బాధితులకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పరిహారం అందజేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు బాధితులకు పరిహారం అందజేస్తున్నామన్నారు. తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డ అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం నరసాపురం గ్రామానికి చెందిన ఎస్ తిమ్మక్కకు, విశాఖపట్నం జిల్లా గోపాలపట్నంకు చెందిన పీ ఈశ్వరమ్మకు రూ.5లక్షల చొప్పున పరిహారాన్ని అందించారు. అలాగే, అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం నరసాపురం గ్రామానికి చెందిన కే నరసమ్మ, పీ రఘు, కే గణేశ్, పీ వెంకటేశ్, చిన్న అప్పయ్యకు రూ.2లక్షల చొప్పున పరిహారం చెక్కులను అందించారు.
అనంతరం చైర్మన్ మాట్లాడుతూ ఆరుగురు కుటుంబాలకు పరిహారం చెల్లించేందుకు టీటీడీ పాలకమండలిలోని బోర్డు సభ్యులతో రెండు కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు నియమించిన రెండు కమిటీలకు సంబంధించి రవాణా తదితర ఖర్చులను టీటీడీ చైర్మన్ సొంత నిధుల నుంచి చెల్లించనున్నారు. రేపటి నుంచి బృందాలు మృతుల కుటుంబాలకు రూ.25లక్షల పరిహారాన్ని స్థానిక ఎమ్మెల్యేతో కలిసి అందజేస్తాయి. అలాగే, మృతుల కుటుంబంలో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం కోసం సంబంధించి వివరాలను సేకరిస్తారు. మృతుల కుటుంబాల్లోని పిల్లలకు విద్యనందించేందుకు వివరాలు సైతం తీసుకుంటారు. తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.5లక్షలు, గాయపడ్డ 31 మందికి రూ.2లక్షల చెక్కులను ఆయా బృందాలు అందిస్తాయి.