హైదరాబాద్, జూలై 22 (నమస్తేతెలంగాణ): తిరుమలలో రోజురోజుకూ పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్-3ని నిర్మించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు నిపుణుల కమిటీ వేయాలని టీటీడీ నిర్ణయించినట్టు టీటీడీ చైర్మన్ బీఆర్నాయుడు వెల్లడించారు. మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవన్లో టీటీడీ పాలకమండలి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అనేక అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా బీఆర్నాయుడు, ఈవో శ్యామలరావు మాట్లాడుతూ.. ఆగస్టు నుంచి ఒంటిమిట్ట దేవాలయంలో మూడుపూటలా భక్తులకు అన్నప్రసాదం వితరణ చేయాలని నిర్ణయించామని, అందుకు రూ.4.35 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. తిరుమలలో అన్ని కార్యాలయాలు ఒకేచోట ఉండేలా పరిపాలన భవనాన్ని నిర్మిస్తున్నట్టు తెలిపారు.