TTD | తెలంగాణ ప్రజాప్రతినిధులకు టీటీడీ శుభవార్త చెప్పింది. తిరుమల శ్రీవారి దర్శనాల కోసం వారానికి రెండు సార్లు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల సిఫారసు లేఖలను అనుమతించాలని నిర్ణయించింది.
తిరుమల శ్రీవారి దర్శనానికి తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతించకపోవడంపై కొద్దిరోజులుగా చర్చ జరుగుతోంది. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతించకపోవడాన్ని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఖండించారు. తిరుమలలో తెలంగాణ మంత్రులు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులను చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు.
ఈ క్రమంలోనే తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖల అంశాన్ని టీటీడీ పునఃపరిశీలించింది. సాటి తెలుగు రాష్ట్రంపై ఇలాంటి నిర్ణయం సరికాదని భావించింది. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతించాలని టీటీడీ బోర్డులోని మెజారిటీ సభ్యులు కూడా కోరారు. దీంతో వారానికి రెండుసార్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతించాలని టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది.