TTD | తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. గరుడ సేవ రోజున భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో రెండు రోజుల పాటు ఘాట్ రోడ్డుపై ద్విచక్ర వాహనాల రాకపోకలపై నిషేధం విధించింది.
అక్టోబర్ 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో అతి ముఖ్యమైన గరుడ సేవ 8వ తేదీన నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 7వ తేదీ రాత్రి 9 గంటల నుంచి అక్టోబర్ 9వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఘాట్ రోడ్డులో ద్విచక్రవాహనాలను అనుమతించమని టీటీడీ తెలిపింది. ఈ విషయాన్ని గమనించి భక్తులు సహకరించాలని కోరింది.
తిరుమల తిరుపతి దేవస్థానం ఏడాది పొడువునా 450 ఉత్సవాలు నిర్వహిస్తుంది. ఇందులో బ్రహ్మోత్సవాలకు ఎంతో విశిష్ఠత ఉన్నది. అక్టోబర్ 3న ఉత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో స్వామివారు ఉదయం, రాత్రి వేళ్లల్లో ఒక్కో వాహనంపై విహరిస్తూ భక్తులను కటాక్షించనున్నారు. 4న సాయంత్రం 5.45 గంటలకు ధ్వజారోహణం కార్యక్రమం జరుగుతంది. బ్రహ్మోత్సవాలకు ఆరంభానికి సూచికగా ధ్వజారోహణం నిర్వహిస్తారు.
ధ్వజస్తంభంపైకి గరుడ పతాకం ఎగురవేసి బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలుకుతారు. ఈ సందర్భంగా రుత్వికులు వేదమంత్రాలతో దర్భ చాపను ధ్వజస్తంభం చుట్టూచుడతారు. ఇక రాత్రి 9 గంటల నుంచి 11 గంటల వరకు పెద్దశేష వాహన సేవపై తిరుమాడ వీధుల్లో విహరిస్తారు. రెండోరోజైన 5న ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనం, రాత్రి 7 గంటల నుంచి 9 వరకు హంస జరుగుతుంది. 6న ఉదయం సింహ వాహనసేవ, రాత్రి ముత్యపు పందిరి, నాలుగో రోజున ఉదయం కల్పవృక్షం వాహనం, రాత్రి సర్వభూపాల వాహన సేవపై శ్రీవారి భక్తులను అనుగ్రహిస్తారు. ఐదోరోజున ఉదయం మెహినీ అవతారం, సాయంత్రం 6.30 గంటల నుంచి 11.30 గంటల వరకు శ్రీవారి గరుడ వాహనంపై భక్తకోటిని కటాక్షిస్తారు. ఉత్సవాల్లో ఆరో రోజున ఉదయం హనుమంత వాహనసేవ, సాయంత్రం 4 గంటల నుంచి 5 వరకు స్వర్ణ రథం, రాత్రి 7 నుంచి 9 వరకు గజ వాహన సేవ జరుగుతుంది. ఏడో రోజున ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహన సేవలను నిర్వహిస్తారు.
ఎనిమిదో రోజున ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహన సేవ జరుగుతుంది. చివరి రోజైన తొమ్మిదో రోజున ఉదయం 6 నుంచి 9 గంటల వరకు చక్రస్నానం, రాత్రి 8.30 గంటల నుంచి 10.30 గంటల వరకు ధ్వజారోహణంతో ఉత్సవాలు ముగియనున్నాయి.