తిరుపతి : ఏపీలోని తిరుపతి ( Tirupati ) జిల్లాలో విషాదం నెలకొంది. నగరి సాల్వపట్టెడలో ఓ మహిళ , ఇద్దరు పిల్లలతో కలిసి బావిలో దూకి ఆత్మహత్యకు ( Suicide ) పాల్పడింది. ఆదివారం ఉదయం ఇంటి సమీపంలో దేవి అనే మహిళ తన పదేళ్ల కూతురు ఐశ్వర్య, మూడేళ్ల అక్షరతో కలిసి బావిలో దూకింది. స్థానికులు తల్లి దేవిని కాపాడగా ఇద్దరు పిల్లలకు ఊపిరాడక మృత్యువాత పడ్డారు.
గాయపడ్డ దేవిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చిన్నారుల మృతదేహాలను బయటకు తీయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.