అమరావతి : ఏపీలోని శ్రీకాకుళం (Srikakulam district) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుదాఘాతంతో ( Electrocution) ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. జిల్లాలోని కంచిలి మండలం తలతంపరలో గ్రామ దేవతల ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం ఉత్సవాలు జరుగుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తెగి పడ్డాయి.
ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వీరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై మంత్రి అచ్చెన్న నాయుడు దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గ్రామ దేవత ఉత్సవాల్లో ఇలాంటి ఘటన జరగటం బాధాకరమని అన్నారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.